సర్వే పకడ్బందీగా చేపట్టాలి

  • ప్రతీ కుటుంబం వివరాలు నమోదు చేయాలి
  • కలెక్టర్లు మనుచౌదరి, రాహుల్​రాజ్​, క్రాంతి

సిద్దిపేట, ములుగు, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలని, ఏ ఒక్క వ్యక్తి పేరు మిస్ కాకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి ఎన్యూమరేటర్లను ఆదేశించారు. శనివారం మున్సిపాలిటీలోని 33 వ వార్డు, కొండపాక మండలం దుద్దెడ, ములుగు మండల కేంద్రంలో పర్యటించి సర్వేను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ఫారంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ, కుల వివరాలను ప్రతి కుటుంబం నుంచి సేకరించి నమోదు చేయాలన్నారు. 

ఎన్యూమరేటర్లు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఫారం నింపాలని సూచించారు. ప్రతి బ్లాకుకు ప్రత్యేక ఎన్యూమరేటర్ ఉండేలా చూసుకోవాలని, స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తిరుగుతూ సర్వేలో ఏమైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని  కోరారు. 

ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం తదితర వివరాలను తమ వద్ద ఉంచుకొని సర్వే కోసం వచ్చే ఎన్యూమరేటర్లకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.  కలెక్టర్ వెంట ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్, తహసీల్దార్లు​దిలీప్ కుమార్, ప్రవీణ్ రెడ్డి, ఆర్ఐ హరీశ్, ఎంపీడీవో శర్మ, సూపర్​వైజర్​రామచంద్ర రెడ్డి ఉన్నారు. మరోవైపు అడిషనల్​కలెక్టర్ అబ్దుల్ హమీద్ కొండపాక మండలం  రాంపూర్,  కుకునూరు పల్లిలో సర్వేను పరిశీలించారు.  

ప్రజలు సహకరించాలి: కలెక్టర్​ రాహుల్​రాజ్​

మెదక్ ​టౌన్: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించి అధికారులు, ఎన్యూమరేటర్లకు పూర్తి సమాచారాన్ని అందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మెదక్​ పట్టణంలోని వెంకట్​రావునగర్​ కాలనీ, హవేలీ ఘన్​పూర్​ మండలంలోని కొత్తపల్లి గ్రామాల్లో సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ఈ సర్వే ద్వారా ప్రజల ఆర్థిక పరిస్థితులు, విద్యా, ఉపాధి అవకాశాలు, సామాజిక స్థితిగతులు, కుల వివరాలు తెలుస్తాయన్నారు. వీటివల్ల అర్హులకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్​కమిషనర్​శ్రీనివాస్​రెడ్డి, తహసీల్దార్లు​లక్ష్మణ్​బాబు, సింధు రేణుక, సూపర్​వైజర్లు, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. 

సర్వే తీరును పరిశీలించిన కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్: ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో ప్రభుత్వ సూచనల మేరకు సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి పట్టణంలోని రాంనగర్, 22వ వార్డు, కొట్లాపూర్ గ్రామంలో సర్వేతీరును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మూడు రోజుల పాటు హౌస్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని శనివారం నుంచి వివరాలు సేకరించడం ప్రారంభించామన్నారు.  పదిమందికి ఒక సూపర్వైజర్ ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా ప్రతి నియోజకవర్గానికి ఒక అధికారిని నియమించామన్నారు ఈ సర్వే  రెండు వారాల్లోగా సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. 

ఎన్యూమరేటర్లు అలసత్వం వహించకుండా కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలన్నారు.  అలాగే జిల్లాలో ఓటర్ల నమోదును  ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఓటర్ నమోదు క్యాంపెయిన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  ఆమె వెంట అడిషనల్​కలెక్టర్ మాధురి, మండల ప్రత్యేక అధికారి ఖాసింబ, ఆర్డీవో రవీందర్​రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కాగా విద్యానగర్ కాలనీ వార్డ్ నెంబర్ 32లో ఎన్యూమరేటర్​ మంత్రి దామోదర రాజనర్సింహ కుటుంబ వివరాలను సేకరించారు. 

ప్రత్యేక ఓటరు నమోదును సద్వినియోగం చేసుకోవాలి

ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. హవేలీ ఘన్​పూర్​ మండలం కొత్తపల్లిలో నిర్వహిస్తున్న స్పెషల్ క్యాంపెయిన్ ను​ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం-- 2025 లో భాగంగా  జిల్లా వ్యాప్తంగా శనివారం, ఆదివారం రోజుల్లో ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నామని వివరించారు.  జనవరి 1వరకు 18 ఏళ్లు నిండిన యువత కొత్త ఓటర్ గా నమోదు చేసుకునేందుకు, మార్పుల సవరణకు, బూత్ లెవల్ ఆఫీసులను సంప్రదించాలన్నారు.