ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు పరిష్కారం చూపాలి : కలెక్టర్ మనుచౌదరి

సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కార మార్గం చూపాలన్నారు. కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 48 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. జిల్లా అధికారులు ప్రజావాణి కి విధిగా హాజరుకావాలని, అనుమతి లేకుండా గైర్హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. డీఆర్​వో నాగరాజమ్మ, అధికారులు పాల్గొన్నారు.

బీటీ రోడ్డు పనులు స్పీడప్​ చేయండి..

పుల్లూరు నుంచి రామంచ వరకు వేస్తున్న బీటీ రోడ్డు పనులు స్పీడప్​ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు మంజూరైన రోడ్డు విస్తరణ పనులు మాత్రం నామమాత్రంగా చేస్తున్నారని ఆరోపించారు. రోడ్డు కిరువైపులా గుంతలు తీసి వదిలేశారని, రాత్రిపూట పొలాల దగ్గరకు వెళ్లే రైతులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ఎన్ఎమ్ఎమ్ఎస్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలని కోరుతూ డీసీసీ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. సిద్దిపేట పట్టణంలోని మాల సంఘానికి చెందిన స్థలాన్ని మున్సిపల్ శాఖ వారు స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని, ఆ స్థలంపై తమకు హక్కు కల్పించాలని కోరారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో నల్లపోచమ్మ ఆలయ స్థలాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న పోడిచేటి విద్యాసాగర్ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.

సంగారెడ్డి టౌన్: ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 42 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, డీఆర్​వో కు  విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.