రైతులకు ఇబ్బంది కలిగించొద్దు : కలెక్టర్​ మనుచౌదరి

చేర్యాల, వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలిగించొద్దని కలెక్టర్​ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలోని నాగపురి, పెద్ద రాజుపేట కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ..  అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్​ కవర్లు ఇవ్వాలన్నారు. అన్ని సెంటర్లలో సరిపడినన్ని గన్నీ బ్యాగులు, తేమ కొలిచే పరికరాలు, బరువు తూచే యంత్రాలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు.  

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబెట్టడం వల్ల ఎక్కువ సమయం పడుతుందని, వ్యవసాయ క్షేత్రాల్లో ఆరబెట్టి తీసుకొస్తే వెంటనే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు.  ధాన్యం కొనుగోలు చేసిన వారం లోపే ఖాతాల్లో డబ్బులు జమవుతాయని చెప్పారు.

ఐకేపీ సెంటర్లు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని జగదేవ్​పూర్​ మండల కేంద్రంలోని పవన సుత మిల్లుకు పంపుతున్నట్లు కలెక్టర్​కు అధికారులు తెలిపారు. కలెక్టర్​వెంట డీఆర్డీఏ జయదేవ్​ఆర్య, సివిల్​సప్లై డీఎం ప్రవీణ్, ఆఫీసర్​తనూజ, అడిషన్​డీ ఆర్డీఏ బాలకిషణ్, ఏపీఎంలు, ఆయా కేంద్రాల ఇన్ చార్జిలు పాల్గొన్నారు.