సంగారెడ్డి జిల్లాలో సమగ్ర సర్వే 75 శాతం పూర్తి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో సమగ్ర సర్వే సజావుగా సాగుతోందని,  ప్రజలందరూ సహకరిస్తున్నారని, 75% సర్వే పూర్తయిందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని 32 వార్డుల్లో సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమగ్ర సర్వే ఉద్దేశం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలను కల్పించడానికే అన్నారు.

సర్వేను నిర్దేశిత కాలపరిమితిలోనే పూర్తి చేయాలని సూచించారు. ఈ సర్వే వల్ల ప్రభుత్వానికి సమగ్రమైన డేటాలభిస్తుందని, తద్వారా కొత్త ప్రణాళికల రూపకల్పనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఈ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలనే సంకల్పంతో జిల్లా యంత్రాంగం  పూర్తి స్థాయిలో పనిచేస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, తహసీల్దార్ దేవదాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

 కలెక్టరేట్ లో పరిశుభ్రత పాటించాలి

 కలెక్టరేట్ లో పరిశుభ్రత పాటించాలని కలెక్టర్​క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం తిరిగి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కలెక్టరేట్ కాంప్లెక్స్ లో శుభ్రత లోపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడక నిషేధం కచ్చితంగా అమలు చేయాలన్నారు. ప్రజలకు తాగునీటి కోసం ఫిల్టర్​ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.

కలెక్టరేట్ మెయింటెనెన్స్ చార్జెస్ ను అధికారులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. కలెక్టరేట్ కు వచ్చే వాహనాలు  క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏవో పరమేశ్  ను ఆదేశించారు . ప్రైవేట్ వ్యక్తులు తమ వాహనాలను అధికారుల పార్కింగ్​లో పెట్టకుండా చూడాలని సెక్యూరిటీస్  సిబ్బందిని ఆదేశించారు. అధికారుల వాహనాల కు స్టిక్కర్స్ వేయించాలని సూచించారు. నో పార్కింగ్ జోన్ లో వాహనాలు పెట్టి వెళ్లిపొతే  జరిమానా విధించాలని కలెక్టరేట్ ఏవో ను ఆదేశించారు.