చివరి దశకు చేరిన కొనుగోళ్లు : క్రాంతి

  • కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్  క్రాంతి అన్నారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్​లో  పౌరసరఫరాల శాఖ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు , ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో ధాన్యం కొనుగోళ్లు, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేశామన్నారు. రైతులు ఖాతాల్లో సుమారు  రూ.160 కోట్ల జమ చేశామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 1. 5 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ని  కొనుగోలు చేశామన్నారు. అధికారులు తరచూ జిన్నింగ్ మిల్లులు  తనిఖీలు చేసి పత్తి రైతులకు నష్టం లేకుండా చూడాలన్నారు. 

ఇటీవల జిల్లాలోని వసతి  గృహాలు, స్కూళ్లలో ఫుడ్ పాయిజన్  జరుగుతున్న విషయాలను దృష్టిలో  పెట్టుకుని  అధికారులు స్టూడెంట్స్​కు నాణ్యమైన భోజనం  అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో తనిఖీలు నిర్వహించి వండిన భోజనం ఎలా ఉందనేది గమనించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఆర్​వో పద్మజారాణి, జిల్లా వ్యవసాయాధికారి శివకుమార్, అధికారులు కొండలరావు, శ్రీనివాస్ రెడ్డి, జంగారెడ్డి పాల్గొన్నారు.

ధరణి, ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి

ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు  ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో ఆర్డీవోలు, తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను స్పీడప్​చేయాలన్నారు. 

సక్సేషన్, పెండింగ్ మ్యూ టేషన్ వంటి దరఖాస్తులకు అవసరమైన రికార్డులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలన్నారు. డాటా కరెక్షన్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వచ్చే నెల మొదటి వారంలోగా పూర్తి చేయాలన్నారు. కొత్తగావచ్చే ప్రజావాణి దరకాస్తులకన్నా ముందే పాతవాటిని  క్లియర్​చేయాలన్నారు. ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లను త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.