ఎస్సీ, ఎస్టీల సమస్యలు వేగంగా పరిష్కరించాలి : కలెక్టర్ క్రాంతి

  • కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎస్సీ, ఎస్టీల సమస్యలు వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా విజిలెన్స్ మానిటరీ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ కోర్టుల్లో పెండింగ్​లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి నెలా ఆయా మండలాల్లోని గ్రామాల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు సివిల్ రైట్స్ డే ను నిర్వహించాలని ఆదేశించారు. సీనియర్ సిటిజన్ల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

కులాంతర వివాహాలు చేసుకున్న దంపతులకు పారితోషికం అందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్​కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలన్నారు. లేబర్ యాక్ట్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

వసతి గృహాల్లో కొత్త మెనూ ప్రకారం భోజనం అందుతుందో లేదో అధికారులు పరిశీలించాలన్నారు. మహనీయుల విగ్రహాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు నెలవారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ చంద్రశేఖర్, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి 

జిల్లాలో దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు వారితో చర్చించి పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్  క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి కలెక్టరేట్​లో దివ్యాంగుల సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రతి నెల మొదటి శనివారం  ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సదరం సమస్యలపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సదరం సర్టిఫికెట్ రెన్యూవల్ కోసం దివ్యాంగులకు ఫోన్ చేసి సమాచారం అందించాలని, నెలలో రెండుసార్లు సదరం స్లాట్ బుకింగ్ నిర్వహించాలన్నారు. వెయిటింగ్ ఇబ్బందులను తొలగించే చర్యలు అధికారులు చేపట్టాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డిఆర్డిఏ అధికారులు సమన్వయంతో దివ్యాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు.

శనివారం, సోమవారం ప్రజావాణికి వచ్చే దివ్యాంగుల కోసం వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని, బ్యాటరీ ఆటోలను ఏర్పాటు చేయాలని సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీడబ్ల్యూవో లలిత కుమారి, పీడీ డీఆర్డీఏ జ్యోతి, జిల్లా జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్​అనిల్ కుమార్, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు అడివయ్య, బసవరాజ్, జుబేదా,ప్రవీణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నర్సింలు, సునీల్, మహేశ్ కుమార్ పాల్గొన్నారు.