సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్లు క్రాంతి, రాహుల్​రాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డిలోని శివాజీ నగర్, ఇరిగిపల్లి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వే ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొన్ని ఇండ్లను సందర్శించి వారి కుటుంబ వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాలను నమోదు చేస్తామన్నారు. 

సర్వే కోసం ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లు, బ్లాక్ ల వారీగా ఇండ్ల వివరాలను సిద్ధం చేసుకోవాలన్నారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో అన్ని ఏర్పాట్లు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్​ను ఆదేశించారు. అనంతరం ఇరిగిపల్లి ప్రాథమిక స్కూల్​ను తనిఖీ చేశారు. స్టూడెంట్ సంఖ్య తక్కువగా ఉండడం చూసి టీచర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంట మునిసిపల్ చైర్మన్  విజయలక్ష్మి, మండల ప్రత్యేకధికారి ఖాసీం బేగ్, తహసీల్దార్ దేవదాస్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్, అధికారులు పాల్గొన్నారు.

వివరాలు పక్కాగా ఉండాలి

మెదక్ టౌన్: సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు పక్కాగా నమోదుచేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ఎన్యుమరేటర్లకు సూచించారు. మెదక్​ మున్సిపాలిటీ పరిధిలోని నవాపేట, హవేళీ ఘనపూర్​లో సర్వేపై హౌస్ లిస్టింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ఈనెల 6 నుంచి 18వరకు జరుగుతుందన్నారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో 18,563 గృహాలు ఉన్నాయని, ఎన్యుమరేటర్లు 126 మంది, 11 మంది సూపర్​వైజర్లను నియమించామన్నారు.

 సర్వేపై గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని దీంతో అధికారులకు సమాచారం అందించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉంటారన్నారు.  ఒకే ఇంట్లో వేర్వేరుగా ఉండే వారి వివరాలు వేర్వేరుగా నమోదు చేయాలన్నారు. కలెక్టర్​ వెంట ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్లు​లక్ష్మణ్​బాబు, సింధు రేణుక, ఎన్యూమరేటర్​జబీన్​ఫాతిమా, ఎంపీడీవో రామేశ్వర్ గౌడ్, ఎన్యుమరేటర్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.