మెడికల్​ కాలేజీ పనులు కంప్లీట్​ చేయాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: మెడికల్​ కాలేజీ బిల్డింగ్​ చివరి దశ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్​  కోయ శ్రీహర్ష ఆదేశించారు. మండలంలోని  అప్పక్ పల్లి గ్రామ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీని బుధవారం కలెక్టర్​ పరిశీలించారు. ప్రిన్సిపాల్  రూమ్, ఎగ్జామినేషన్  హాల్, లెక్చర్  రూమ్, ల్యాబ్ ల ఏర్పాటు పనులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

కరెంట్​ సప్లై కోసం కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయాలని, కాలేజీకి అవసరమైన ఇంటర్నెట్  సౌకర్యం కోసం బీఎస్ఎన్ఎల్  అధికారులతో మాట్లాడి  వెంటనే  కనెక్షన్  తీసుకోవాలని చెప్పారు. కాలేజీ బయట, లోపల సీసీ కెమెరాలను గురువారం సాయంత్రంలోగా ఏర్పాటు చేయాలని తెలిపారు. కాలేజీ ఆవరణలో మొక్కలను నాటాలని సూచించారు. అనంతరం బృందావన్ కాలనీలో కొనసాగుతున్న  మెడికల్  కాలేజీ హాస్టల్  పనులను పరిశీలించారు. కాలేజీ ప్రిన్సిపాల్  డాక్టర్  రాంకిషన్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్  రంజిత్, టీఎస్ఎంఐడీసీ ఆఫీసర్లు పాల్గొన్నారు.