రోగులతో దురుసుగా వ్యవహరించవద్దు : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: రోగులతో సిబ్బంది దురుసుగా వ్యవహరించవద్దని కలెక్టర్​ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులను పరిశీలించారు. మెటర్నటీ వార్డు, ఆపరేషన్  థియేటర్, సీ సెక్షన్, ఆర్థో, సర్జికల్, జనరల్ వార్డును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఆర్థోపెడిక్  వార్డులోని ఐదుగురు పేషెంట్లలో ముగ్గురు పేషంట్ల బ్లడ్​ శాంపిళలను ప్రైవేట్  ల్యాబ్ కు పంపించినట్లు గుర్తించి, అక్కడి నర్సులను ఈ విషయంపై ప్రశ్నించారు. 

ప్రైవేట్  ల్యాబ్ కు ఎందుకు రెఫర్  చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఎలా ఉందని చిక్సిత పొందుతున్న రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలోని తాగునీటి ట్యాంకును పరిశీలించారు. నీటి సరఫరా సరిగా లేకపోవడం, ఆసుపత్రిలో పవర్  బోర్​ ద్వారా ఉప్పు నీరు వస్తుందని తెలుసుకున్న కలెక్టర్, ఆర్వోబీ ప్లాంట్  ఏర్పాటు చేసేందుకు ప్రపోజల్స్​ పంపించాలని సూపరింటెండెంట్  రంజిత్ కుమార్ కు సూచించారు. ఆర్ఎంవో పావని, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.