అంగన్​వాడీ వర్కర్లు సక్రమంగా డ్యూటీ చేయాలి : కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: అంగన్ వాడీ కార్యకర్తలు, సూపర్ వైజర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష ఆదేశించారు. చాలా మంది నిర్ణీత సమయానికి డ్యూటీకి హాజరు కావడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని 3 ఐసీడీఎస్  ప్రాజెక్టుల పనితీరుపై కలెక్టర్  రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య తగ్గుతోందని, దీనిని పెంచేందుకు ప్రయత్నించాలని సూచించారు. సూపర్ వైజర్లు ప్రతిరోజు రెండు కేంద్రాలను చెక్  చేయాలన్నారు.

పిల్లల ఎత్తు, బరువు లెక్కల్లో తేడాలు రాకుండా చూసుకోవాలని చెప్పారు. బాలామృతం సరఫరా కాకపోతే మీరేం చేస్తున్నారని డీడబ్ల్యూవో నరసింహారావును ప్రశ్నించారు.  పోషణ్  అభియాన్  అటెండెన్స్  ఎవరు వేస్తున్నారని ప్రశ్నించి, తప్పులు జరగకుండా చూసుకోవాలన్నారు. వర్షాకాలం సీజన్  ప్రారంభం అవుతున్న దృష్ట్యా అంగన్ వాడీ కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  ఆదేశించారు. వచ్చే నెల నుంచి 10 లోపు అంగన్ వాడీ కేంద్రాలకు బియ్యం, గుడ్లు సప్లై చేసేలా సంబంధిత  కాంట్రాక్టర్ తో మాట్లాడాలని డీడబ్ల్యూవోను కలెక్టర్  ఆదేశించారు.