ఇందిరమ్మ సర్వే పక్కాగా ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

హాలియా, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పూర్తి వివరాలను యాప్ లో అప్ లోడ్ చేసిన తర్వాతే  సబ్మిట్  చేయాలని, లేదంటే ఇబ్బందులు వస్తాయని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బుధవారం గుర్రంపోడు మండలం జిన్నాయి చింతలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కలెక్టర్ ఇండ్లకు వెళ్లి దరఖాస్తుదారుల పేర్లు, సర్వే వివరాలను తెలుసుకుని అనంతరం మాట్లాడారు. 

ALSO READ : మహిళకు ఆర్థిక తోడ్పాటు .. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ.83.16 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

దరఖాస్తుదారు ఫొటోతో సహా ఇంటి పత్రాలు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునేలా ఉంటే కొత్త ఇంటి స్థల వివరాలను యాప్ లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు సర్వే బృందానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, ఎంపీడీవో మంజుల, ఎంపీఓ పద్మ, పంచాయతీ సెక్రటరీ స్వీటీ  ఉన్నారు. 

విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు 

దేవరకొండ(చింతపల్లి, కొండమల్లేపల్లి) : విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే కఠిన చర్యలు తప్పవని నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. చింతపల్లి మండలం గాసిరాం తండా, నసర్లపల్లి, కొండ మల్లేపల్లి మండలం గుర్రపుతండా, దర్గా తండాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను తనిఖీ చేశారు. దరఖాస్తుదారుల వివరాలు నమోదు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ యాప్ లో అప్ లోడ్ చేయకపోవడంతో  కలెక్టర్ గుర్తించి ఎంపీడీవో సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  షోకాజ్ నోటీస్ జారీ చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తు చేసుకోకుంటే.. ప్రస్తుతం ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసుల్లో మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.