రైతులు అధైర్య పడొద్దు : బాదావత్ సంతోష్

  • 48 గంటల్లోనే ఖాతాల్లో ధాన్యం డబ్బులు
  • కలెక్టర్ బాదావత్ సంతోష్

కందనూలు, వెలుగు: రైతులు అధైర్య పడొద్దని, ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్లు నాగర్ కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. బిజినేపల్లి మండలం మంగనూరు, లట్టుపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్​తో కలిసి శనివారం ఆయన తనిఖీ చేశారు. ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని సూచించారు.

 కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు చేరేలా చర్యలు చేపట్టాలని, ముందస్తుగానే గన్ని బ్యాగులను సిద్ధం చేసుకోవాలన్నారు. అనంతరం బిజినేపల్లిలోని 5వ అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అంగన్వాడీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సీడీపీఓలు, ఆయా సెంటర్ల టీచర్లు కృషి చేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసులు, బిజినేపల్లి సీడీపీఓ సంగీత, అంగన్వాడీ సూపర్ వైజర్లు మల్లీశ్వరి, మండల స్థాయి అధికారులు  ఉన్నారు.