చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం : కలెక్టర్ బదావత్ సంతోష్

  • ఈశ్వరమ్మ ఆరోగ్య  పరిస్థితిపై కలెక్టర్ ఆరా 

కొల్లాపూర్, వెలుగు: మండలంలోని మొలచింతలపల్లి గ్రామాన్ని బుధవారం కలెక్టర్ బదావత్  సంతోష్  సందర్శించారు. ముందుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొంది వచ్చిన ఈశ్వరమ్మ ఇంటికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని కలెక్టర్  అడిగి తెలుసుకున్నారు. రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ భూమి సాగులోకి తెచ్చేందుకు సాగునీటి ఏర్పాట్లు చేయాలన్నారు.

అనంతరం జడ్పీ హైస్కూల్​ను తనిఖీ చేసి, అమ్మ ఆదర్శ పాఠశాల పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత మొలచింతలపల్లి గ్రామంలోని భ్రమరాంబ కాలనీని సందర్శించి చెంచుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆధార్  కార్డు లేని చెంచులకు కొత్త కార్డు అందించేందుకు గ్రామంలో ఆధార్  సెంటర్​ ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొత్త రేషన్  కార్డులు అందజేస్తామని తెలిపారు. పోడు భూములు సాగు చేస్తున్న వారికి న్యాయం చేస్తానని, కొత్తగా అడవిలో చెట్లు నరికి సాగు చేసేందుకు అంగీకరించేది లేదన్నారు. డీఎఫ్​వో రోహిత్ గోపిడి, డీటీడబ్ల్యూవో కమలాకర్ రెడ్డి, కొల్లాపూర్  ఆర్డీవో నాగరాజు, సమగ్ర శిక్ష అకడమిక్  మానిటరింగ్  ఆఫీసర్​ షర్ఫుద్దీన్, కొల్లాపూర్  తహసీల్దార్  శ్రీకాంత్  ఉన్నారు.