నల్లమల చెంచులకు అన్ని పథకాలు అందాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

  • స్పెషల్  క్యాంప్​ ద్వారా ఆధార్, రేషన్ కార్డ్​, బర్త్​ సర్టిఫికెట్లు జారీ
  • జన్​మన్​ స్కీం రివ్యూలో కలెక్టర్​ బదావత్​ సంతోష్​

నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల చెంచులకు పీఎం జన్​మన్​ పథకం కింద అన్ని సౌలతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని నాగర్​కర్నూల్​ కలెక్టర్  బదావత్ సంతోష్​ ఆదేశించారు. చెంచులకు ఆధార్‌‌‌‌, రేషన్ కార్డులు, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేసి జీరో అకౌంట్లు ఓపెన్​ చేయించాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్​లో పీఎం జన్​మన్  జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్  స్కీంపై ఐటీడీఏ పీవో రోహిత్, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్​ రివ్యూ నిర్వహించి మాట్లాడారు.  ఇప్పటివరకు చెంచుపెంటల్లో జరిగిన పనులు, జరగాల్సిన పనులపై ఆరా తీశారు.

 జిల్లాలోని 8 మండలాల్లో 88 చెంచు పెంటల్లోని 8,772 మందికి జన్‌‌‌‌మన్‌‌‌‌ పథకం ద్వారా 11 రకాల మౌలిక వసతులు అందేలా చూడాలన్నారు. వారం రోజుల్లో చెంచులకు ఆధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. 890 ఇండ్లు, రోడ్లు, నివాసాలకు తాగు నీటి సరఫరా, మొబైల్‌‌‌‌ మెడికల్‌‌‌‌ యూనిట్లు, అంగన్‌‌‌‌వాడీ సెంటర్లు, విద్యుత్‌‌‌‌ కనెక్షన్లు అందించాలని ఆదేశించారు.  పథకాలు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్‌‌‌‌ నిర్వహించాలన్నారు. 

సర్వే ఆధారంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ అధికారులు ఆయుష్మాన్  భారత్  కార్డులను తయారు చేసి అందరికీ అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.   బ్యాంక్​ ఖాతాలు లేని చెంచులకు జన్ ధన్  బ్యాంక్  అకౌంట్లు తెరిచేలా చర్యలు తీసుకోవాలని ఎల్డీఎంను ఆదేశించారు. పట్టా భూమి ఉన్న కుటుంబ యజమాని మరణిస్తే వారి వారసులకు భూ బదలాయింపు ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు. జిల్లా వెటర్నరీ ఆఫీసర్  జీవీ రమేశ్, డీఆర్డీవో చిన్న ఓబులేషు, డీపీవో  రామ్మోహన్​రావు, ఆర్డీవోలు మాధవి, నాగరాజు పాల్గొన్నారు.