సజావుగా వడ్లు కొనుగోలు చేయాలి : కలెక్టర్ బదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్  బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో వడ్ల కొనుగోలుపై అడిషనల్​ కలెక్టర్  కె సీతారామారావుతో కలిసి రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఈ సీజన్​లో 2.18 లక్షల మెట్రిక్  టన్నుల వడ్లు వస్తాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారని, జిల్లాలో 251 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎక్కడైనా అధికారులు, సిబ్బంది తప్పిదంతో రైతులు ఇబ్బందులు పడినా, బిల్లుల చెల్లింపులో జాప్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 వడ్లు కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు కొనుగోలు కేంద్రాలకు పంపాలని సూచించారు. పోలీస్, రవాణా శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి వడ్లు రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు. డీఎస్ వో శ్రీనివాస్, డీఆర్డీవో చిన్న ఓబులేషు, డీఏవో చంద్రశేఖర్, డీసీవో రఘు, సివిల్  సప్లై డీఎం రాజేందర్, జిల్లా మార్కెటింగ్  అధికారి స్వరణ్ సింగ్  పాల్గొన్నారు.