సమగ్ర సర్వే పక్కాగా చేయాలి : కలెక్టర్ సిక్తా పట్నాయక్

కొల్లాపూర్, వెలుగు : కొల్లాపూర్​ పట్టణంలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వే పక్కాగా చేయాలని నాగర్​కర్నూల్ ​కలెక్టర్ ​బాదావత్ సంతోష్ ఎన్యుమరేటర్లకు సూచించారు. బుధవారం పట్టణంలోని వార్డ్ నంబర్ 19లో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు.  ఇప్పటివరకు ఎన్ని ఇళ్లలో సర్వే పూర్తయ్యింది, సర్వేలో ఏవైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? కొత్తగా గమనించిన అంశాలు, తదితర విషయాలను ఎన్యుమరేట్లను అడిగి తెలుసుకు న్నారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటి యజమానులు ముందే సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లి తప్పుల్లేకుండా సర్వే చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియను స్పీడప్​ చేయాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో బన్సీ లాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ విష్ణువర్ధన్ రావు ఉన్నారు.

మిస్టేక్ చెయ్యొద్దు..

మద్దూరు : సమగ్ర కుటుంబ సర్వేలో తప్పులు దొర్లకుండా చూడాలని నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. మండల కేంద్రంలోని పలు వార్డుల్లో ఎంపీడీవో నర్సింహారెడ్డితో కలిసి ఆమె సర్వేను పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం మండలంలోని దోరెపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాని  పరిశీలించారు. దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్మి మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో రామన్న పాల్గొన్నారు.


నవాబుపేట:  మండలంలోని పోమాలలో నిర్వహిస్తున్న సమగ్ర సర్వేను మహబూబ్​నగర్ ​అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరిశీలించారు. ప్రజల వద్ద సరైన సమాచారాన్ని సేకరించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్త పడాలని సిబ్బందికి ఆయన సూచించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో అధికారుల పనితీరుపై సమీక్షించారు.