ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై అవగాహన కల్పించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

దేవరకొండ, చందంపేట, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మంగళవారం చందంపేట మండలం గాగిళ్లపూర్, హంఖ్య తండా, మూర్పునూతల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆమె తనిఖీ చేశారు. దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ సర్వేకు వచ్చిన సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. 

గ్రామాల్లో దరఖాస్తుదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లపై పూర్తిస్థాయి అవగాహన కల్పించి సర్వేలో పాల్గొనేలా చూడాలని ఎంపీడీవో లక్ష్మిను ఆదేశించారు. అనంతరం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో రెవెన్యూ సమస్యలు, ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, చందంపేట స్పెషల్ ఆఫీసర్ జాకబ్, ఎంపీడీవో లక్ష్మి పాల్గొన్నారు. 

ఇండ్ల సర్వేను స్పీడప్ చేయాలి 

శాలిగౌరారం ( నకిరేకల్), వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను స్పీడప్​చేయాలని జాయింట్ కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం శాలిగౌరారం మండలం అడ్లూర్, గురజాల గ్రామాల్లో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో  వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం 4,31,831 దరఖాస్తులు వచ్చాయన్నారు. 

ఇందులో 3,60,205 గ్రామాల్లో 71,626 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కొన్ని గ్రామాల్లో నెట్ వర్క్ ఇబ్బంది వల్ల సర్వే వివరాలు యాప్​లో అప్ లోడ్ చేయడానికి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. డిసెంబర్ 31లోపు సర్వేను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి మాన్యానాయక్, తహసీల్దార్ పి.యాదగిరి, ఎంపీవో అల్లూరి పద్మ, ఆర్ఐ మహ్మద్ అజారుద్దీన్ తదితరులు  పాల్గొన్నారు. 

ఇందిరమ్మ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి 

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పకడ్బందీగా చేపట్టాలని యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ గంగాధర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం యాదగిరిగుట్ట మండలం దాతరుపల్లి గ్రామ పరిధిలోని గొల్లగుడిసెలులో ఆఫీసర్లు చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆయన పరిశీలించారు.