చిన్నంబావి మండలాల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

పాన్​గల్/వీపనగండ్ల/చిన్నంబావి, వెలుగు:  కలెక్టర్  ఆదర్శ్​ సురభి బుధవారం పాన్​గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. పానగల్,  వీపనగండ్ల కేజీబీవీలతో పాటు  హరిజనవాడ ప్రైమరీ స్కూల్​ను విజిట్​ చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కింద మంజూరైన పనులను పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్  అధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 ఆసుపత్రికి వచ్చే జ్వర బాధితులకు రక్త పరీక్షలు చేయాలని ఆదేశించారు. దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై రూపొందించిన పామ్​ప్లేట్లను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు. వీపనగండ్ల స్కూల్​లో మిడ్​ డే మీల్స్​​ నాణ్యత సరిగా ఉండడం లేదని కలెక్టర్​ దృష్టికి తేగా హెచ్ఎంతో కలిసి భోజనం రుచి చూశారు. పిల్లలతో కలిసి భోజనం చేయాలని, సరుకులు వచ్చినప్పుడు వాటి నాణ్యత, కాలపరిమితి పరిశీలించాలని హెచ్ఎంకు సూచించారు.  అనంతరం చిన్నంబావి మండలం పెద్ద మారూర్  జడ్పీ హైస్కూల్​ విజిట్​ చేశారు. 

మన ఊరు మన బడి కింద మంజూరై  మధ్యలో ఆగిన పనులను పరిశీలించారు. టెన్త్​క్లాస్​ స్టూడెంట్లకు లెక్కలు ఇచ్చి పరిష్కరించాలని సూచించారు. సమాధానాలు సరిగా చెప్పిన స్టూడెంట్లకు నోట్  పుస్తకాలు బహూకరించారు. కార్యక్రమంలో డీఈవో  గోవిందరాజు, పానగల్  ఎంపీడీవో గోవిందరావు, చిన్నంబావి ఎంపీడీవో వెంకటరమణ,  కేజీబీవీ ఎస్ వోలు హేమలత, అరుణ పాల్గొన్నారు.