ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలి : కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగు : రాష్ట్రంలో ప్రజా పాలన ప్రారంభించి  ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ కళాయాత్రను విజయవంతం చేయాలని   కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు.  ప్రజా పాలన ద్వారా ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా  జిల్లాలో  ఈ నెల 19 నుంచి  డిసెంబర్  7 వరకు ప్రజా పాలన విజయోత్సవ కళా యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. మంగళవారం అడిషనల్​  కలెక్టర్లు  సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లుతో కలిసి  కలెక్టరేట్​లో  ప్రజా పాలన విజయోత్సవ కళాయాత్రను  ప్రారంభించారు.   

 తాగునీరు, శానిటేషన్​పై దృష్టి

జిల్లాలో తాగు నీరు, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో   జిల్లాస్థాయి తాగు నీరు, పారిశుధ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ,  జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇల్లు ఉండకుండా చూడాలని, పేదలకు స్వచ్చ భారత్ కింద  ఉచిత మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

 మరుగుదొడ్లు లేని ఇళ్ళు జిల్లాలో 365 గుర్తించామని, డీఆర్​డీవో  కలెక్టర్ దృష్టికి తేగా  వాటికి వెంటనే మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన కట్టించాలన్నారు.  ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని 50 మైక్రాన్ కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ అమ్మిన వారిపై జరిమాన విధించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.   సమావేశంలో  డిఆర్డిఏ పీడీ ఉమాదేవి,  మిషన్ భగీరథ ఈఈ  మేఘా రెడ్డి, డీపీఓ  సురేశ్​, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, డి.పి ఆర్. ఒ సీతారాం తదితరులు పాల్గొన్నారు.