ఇంటింటి సర్వే పూర్తి చేయాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, వెలుగు :  ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి ఆదేశించారు.  శుక్రవారం కలెక్టరేట్  నుంచి జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్  నిర్వహించి స్పెషల్  సమ్మరీ రివిజన్, దోమల నివారణ వంటి అంశాలపై రివ్యూ చేశారు. ఇంటింటి సర్వేలో జిల్లా వెనకబడి ఉందని, సర్వేను స్పీడప్​ చేయాలని సూచించారు. రెండు రోజుల్లో సర్వే 30 శాతం పూర్తి కావాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్  స్టేషన్ల మార్పులు, చేర్పులు ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. 

డెంగ్యూపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ఇంటింటికీ పాంప్లెట్స్  పంచడం, చెత్త సేకరణ ట్రాక్టర్  ద్వారా, టాంటాం వేయించాలని ఆదేశించారు. ఓపెన్  ప్లాట్ల యజమానికి నోటీస్  జారీ చేయాలని, శుభ్రం చేయించకుంటే జీపీ ద్వారా శుభ్రం  చేయించి ప్రభుత్వ భూమి అని ప్లాటు వద్ద బోర్డు పెట్టాలని సూచించారు. అడిషనల్​ కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, నగేశ్, ఆర్డీవో పద్మావతి, డీపీవో రమణమూర్తి, జడ్పీ సీఈవో యాదగిరి, డీఆర్డీవో ఉమాదేవి, డీఎంహెచ్​వో జయచంద్ర మోహన్  పాల్గొన్నారు.

దోమల వ్యాప్తిని అరికట్టాలి

మదనాపురం : దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్  ఆదర్శ్  సురభి సూచించారు. డ్రై డే సందర్భంగా శుక్రవారం మదనాపురం, నరసింగాపురం, గోపెన్ పేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. పారిశుధ్య పనుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పీహెచ్​సీని తనిఖీ చేశారు. 

రక్త పరీక్షలపై ఆరా తీసిన అనంతరం స్వయంగా రక్త పరీక్ష చేయించుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్  సాయినాథ్ రెడ్డి, డాక్టర్ ప్రవళిక, మెడికల్  ఆఫీసర్  భవాని రెడ్డి, మండల ప్రత్యేకాధికారి మల్లికార్జున్, తహసీల్దార్  అబ్రహం లింకన్, ఎంపీడీవో ప్రసన్నకుమారి, ఎంపీవో ఉషణప్ప పాల్గొన్నారు.