- మధ్యాహ్నం 12 గంటలకూ చలిమంటలు వేసుకున్న జనం
- నేడు కూడా ఇదే పరిస్థితిఉంటుందన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో పగటిపూట టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురుపట్టింది. మబ్బులు కమ్మేశాయి. బుధవారం మొదలైన ముసురు గురువారం కూడా కొనసాగింది. గురువారమంతా సూర్యుడి జాడే కనిపించలేదు. మిట్టమధ్యాహ్నం దాటినా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.
మధ్యాహ్నం 12 గంటల సమయంలోనూ ప్రజలు వెచ్చదనం కోసం చలిమంటలేసుకున్నారంటేనే చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో రాత్రి టెంపరేచర్లు పగటి టెంపరేచర్లకు నాలుగైదు డిగ్రీలకన్నా తక్కువగానే నమోదయ్యాయి.
ఉన్నట్టుండి వర్షం..
ఉదయమంతా ఆకాశం మబ్బు పట్టి.. చిన్న చిన్న చినుకులు పడ్డాయి. మధ్యాహ్నం 3 గంటలు దాటాక ఒక్కసారిగా మబ్బులు కమ్మేశాయి. హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూల్, వికారాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, సిద్దిపేట, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్, జనగామ, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి.
మిగతా జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలో వర్షపాతం కొంచెం ఎక్కువగా రికార్డయింది. అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాయత్రినగర్‌లో 2.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ సిటీలోని ముషీరాబాద్, షేక్‌పేట, బొమ్మలరామారం, హిమాయత్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, నాంపల్లి, అబ్దుల్లాపూర్మెట్సహా సిటీ అంతటా వర్షం పడింది.
ఈ జిల్లాల్లో చలి ఎక్కువ..
రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌లో 32.9 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డయింది. అత్యల్పంగా జనగామ, ములుగు జిల్లాల్లో 23 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాటితో పాటు యాదాద్రి, నల్గొండ, హనుమకొండ, హైదరాబాద్, సిద్దిపేట, ములుగు, మహబూబాబాద్, మేడ్చల్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 24 నుంచి 25 డిగ్రీల మధ్యనే పగటి టెంపరేచర్లు రికార్డయ్యాయి.
మొత్తంగా ఓ పది జిల్లాలు మినహా మిగతా రాష్ట్రమంతటా మధ్యాహ్నంపూటే చలి తీవ్రత ఎక్కువగా నమోదైంది. అదే సమయంలో బుధవారం రాత్రి టెంపరేచర్లు 15 డిగ్రీలకన్నా ఎక్కువగా నమోదయ్యాయి. 12 జిల్లాల్లో 20 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లి టీలో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా 15.2 డిగ్రీలు నమోదుకాగా.. నారాయణపేట జిల్లా ధన్వాడలో 15.4 డిగ్రీలు రికార్డయింది.
ఇయ్యాల కూడా అదే పరిస్థితి..
రెండు రోజులుగా ఉన్న వాతావరణమే శుక్రవారం కూడా కంటిన్యూ అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. గురువారం బలహీనపడిందని.. అయితే, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంపై ఇంకా ప్రభావం ఉండే అవకాశం ఉందని తెలిపింది. దాని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతాయని పేర్కొంది.
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు మధ్యాహ్నం చలివాతావరణం కొనసాగుతుందని పేర్కొంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు ఏపీలో తీరప్రాంతాల వద్ద 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ రాష్ట్రంలోని అన్ని పోర్టుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్టు వెల్లడించింది.