టీటీడీ వద్ద 85 టన్నుల చెల్లని నాణేలు.. కరిగించేందుకు ఒప్పందం

టీటీడీ వద్ద 85 టన్నుల చెల్లని నాణేలు.. కరిగించేందుకు ఒప్పందం

తిరుమల, వెలుగు: తిరుమల శ్రీవారి దగ్గర 85 టన్నుల చెల్లని నాణేలున్నాయట. వాటిలోని కొన్ని మినహా మిగతా నాణేలను కరిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమవుతోంది. స్టీల్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (సెయిల్​)తో ఒప్పందం కుదుర్చుకుంది. 2011లో పావలా నాణేలను రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా రద్దు చేసింది. అయినా 2014 వరకు బ్యాంకులు టీటీడీ నుంచి ఆయా కాయిన్లను డిపాజిట్​ చేయించుకున్నాయి. తర్వాత వద్దన్నాయి. దీంతో అప్పటి నుంచి భక్తులు హుండీలో వేస్తున్న ఇలాంటి చెల్లని నాణేలు దాదాపు 85 టన్నులకు చేరాయి.
టన్నుకు రూ.30 వేల చొప్పున సెయిల్​కు అమ్మేలా టీటీడీ ఒప్పందం చేసుకుంది. అయితే, డబ్బులు తీసుకోవడానికి బదులు, లడ్డూలు పెట్టే ట్రేలు తీసుకోవాలని నిర్ణయించింది. అంతకుముందు సెయిల్​ నుంచే కొనుగోలు చేసిన స్టీల్​ ట్రేల క్వాలిటీ బాగుండడంతో, ఇప్పుడూ ట్రేలే తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం టీటీడీ వద్ద ఆరు రకాల నాణేలున్నాయి. అల్యూమినియం, కప్రోనికల్​, ఇత్తడి, నికెల్​, స్టీల్​, రాగి నాణేలు అందులో ఉన్నాయి. ఇత్తడి, రాగి నాణేల్లో బంగారం కలిసే అవకాశం ఉండడంతో వాటిని టీటీడీ అప్రైజర్లతో మరోసారి తనిఖీ చేయించనుంది. ఆ తర్వాత రెండు దశలుగా వాటిని అమ్మనుంది. మొదటి దశలో 40 టన్నులు, రెండో దశలో 45 టన్నుల చొప్పున నాణేలను తరలించనున్నారు. 1947కు ముందున్న నాణేలను మాత్రం తన వద్దే ఉంచుకోవాలని టీటీడీ నిర్ణయించింది.