స‌హ‌జీవ‌నాన్ని అత్యాచారంగా భావించ‌లేం: సుప్రీం

స‌హ‌జీవ‌నాన్ని అత్యాచారంగా భావించ‌లేం: సుప్రీం

సుప్రీంకోర్టు …వైవాహిక అత్యాచారం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. సహజీవనం చేసిన వ్యక్తితో ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొని, పెళ్లి చేసుకోడానికి నిరాకరించడాన్ని అత్యాచారంగా భావించలేమని స్పష్టం చేసింది. పురుషులు లేదా మహిళలు ఎవరైనా సరే పెళ్లితో తప్పుడు వాగ్దానాలు చేయడం సరికాదని తేల్చింది. రెండేళ్ల క్రితం నాటి కేసు విచారణ సందర్భంగా సోమవారం దీనికి సంబంధించి సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చేసింది. కలిసి జీవించిన జంట.. భర్త మంచివాడు కాకపోయినా శృంగారంలో పాల్గొనడాన్ని అత్యాచారం అంటారా అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే ప్రశ్నించారు.

వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ అనే వ్యక్తి గతంలో ఓ మహిళతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రెండేళ్ల తర్వాత వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పెళ్లితో తనను మోసగించి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి దిగువ కోర్టులో తనకు న్యాయం జరగడం లేదని భావించిన వినయ్‌ ప్రతాప్‌ సింగ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. పరస్పర అంగీకారంతోనే తాము ఒక్కటయ్యామని, ఇందులో తన తప్పేమీ లేదని, కాబట్టి బెయిలు ఇప్పించాల్సిందిగా కోరాడు.  దీనికి సంబంధించి పిటిషన్‌ దాఖలు చేయగా.. సోమవారం విచారణకు వచ్చింది.