పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ: సీఎం రేవంత్ రెడ్డి

  • ప్రపంచ స్థాయి సంస్థలు ముందుకొస్తున్నయ్​: సీఎం రేవంత్​
  • బండ తిమ్మాపూర్​లో  కోకాకోలా గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ఫ్యాక్టరీ ప్రారంభం

సిద్దిపేట, వెలుగు: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి సంస్థలు ముందుకొస్తున్నాయని,  బండ తిమ్మాపూర్ లో హిందూస్థాన్​కోకాకోలా బెవరేజేస్ (హెచ్ సీసీబీ) పెట్టుబడులు పెట్టడం ఇందుకు నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదని, పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ అని ఆయన తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్​లో కోకాకోలా గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించారు.  అనంతరం మాట్లాడుతూ.. కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఇక్కడి యువతకు ఉపాధి, ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పారు. మంత్రి  శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అత్యాధునిక టెక్నాలజీతో ప్రారంభించిన గ్రీన్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్ ఫ్యాక్టరీ తెలంగాణ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ముందడుగు అని తెలిపారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల జిల్లా అభివృద్ధి చెందుతుందని మంత్రి  పొన్నం ప్రభాకర్  తెలిపారు. పర్యావరణ అనుకూల పారిశ్రామికవృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కోకాకోలా ఫ్యాక్టరీ ఏర్పాటు అందులో భాగమేనని మంత్రి  కొండా సురేఖ అన్నారు. కార్యక్రమంలో  సిద్దిపేట కలెక్టర్​ ఎం.మనుచౌదరి, మెదక్​ కలెక్టర్​ రాహుల్ రాజ్,  హిందుస్తాన్ కోకా-కోలా బెవరేజెస్ సీఈవో జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్, సిద్దిపేట, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్​చార్జీలు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

ఫ్యాక్టరీలో గంట సేపు సీఎం

మధ్యాహ్నం 2.20 గంటలకు హెలిక్యాప్టర్​లో బండ తిమ్మాపూర్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. కోకకోలా ఫ్యాక్టరీలో దాదాపు గంటసేపు గడిపారు. మొదట ప్యాక్టరీ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన..ఫ్యాక్టరీలోని అన్ని విభాగాలను సందర్శించి, కోకాకోలా తయారీ విధానాన్ని  పరిశీలించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రులతో కలసి సీఎం హైదరాబాద్ తిరిగి వెళ్లారు.  సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనను కలిసేందుకు జిల్లా కాంగ్రెస్  నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున బండ తిమ్మాపూర్ కు వచ్చారు. కాగా, ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్​ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ కొద్దిసేపు ఉద్రిక్తతకు కారణమైంది.