మెజార్టీ వాటాలు కొనేందుకు చర్చలు
కోస్టా కాఫీ కొనుగోలు తర్వాత ఇదే మేజర్ డీల్
ముంబై : దేశంలో అతిపెద్ద కాఫీ చెయిన్ కేఫ్ కాఫీ డేలో మెజార్టీ వాటాలను కొనడానికి సాఫ్ట్ డ్రింక్ తయారీదారు కోకా–కోలా చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్ అయితే, కోకా–కోలాకు ఇదే రెండో అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్. 2018 సెప్టెంబర్‌లో యూకేకు చెందిన కోస్టా కాఫీని 5.1 బిలియన్ డాలర్లకు(రూ.35,231 కోట్లకు) కోకా–కోలా కొనుగోలు చేసింది. కోర్ కార్బొనేటెడ్ డ్రింక్స్ వ్యాపారాల్లో మరింత విస్తరించేందుకు కోకా–కోలాకు ఈ డీల్ సహకరించనుందని ఈ విషయం తెలిసిన ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. కోకా–కోలా, కేఫ్ కాఫీ డేతో జరుపుతోన్న చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని తెలిసింది. కోకా–కోలా ప్రధాన కార్యాలయం అట్లాంట నుంచి ఈ కొనుగోలుకు సంబంధించిన చర్చలు శరవేగంగా కొనసాగుతున్నాయి.
ఈ బెవరేజ్ మేకర్ గ్లోబల్ టీమ్‌కు చెందిన అధికారులు కేఫ్ కాఫీ డే మేనేజ్‌మెంట్ ఎప్పడికప్పుడు ఈ చర్చలు జరుపుతున్నారు. సాఫ్ట్ డ్రింక్స్‌కు వృద్ధి నెమ్మదిస్తోన్న క్రమంలో, కేఫ్ వ్యాపారాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ పూర్తిగా ఊహాగానాలని, కంపెనీ పాలసీ ప్రకారం,దీనిపై ఎలాంటి కామెంట్ చేయమని కాఫీ డే ఎంటర్‌ప్రైజస్ అధికార ప్రతినిధి చెప్పారు. దేశంలో అతిపెద్ద కాఫీ చెయిన్ అయిన కేఫ్ కాఫీ డేకు వీజీ సిద్ధార్థ ప్రమోటర్. కాఫీ డే ఎంటర్‌ప్రైజస్‌కు ఇది సబ్సిడరీ. 2019 మార్చి నాటికి 1,752 కేఫ్స్ ఉన్నాయి. అధికారిక కేఫ్ స్పేస్‌లో కేఫ్ కాఫీ డే మార్కెట్ లీడర్‌గా ఉంది. స్టార్‌బక్స్, బరిస్టా, కోస్టా కాఫీలకు ఇది పోటీగా ఉంది. అయితే కేఫ్ కాఫీ డే వ్యాపారాలు గత రెండేళ్ల నుంచి నెమ్మదించాయి.
