హాస్టల్ బాత్‎రూమ్‎లో విద్యార్థినుల నగ్న వీడియోల ఇష్యూ.. CMR కాలేజ్ ప్రిన్సిపాల్ ఏమన్నారంటే..?

హైదరాబాద్: మేడ్చల్‎లోని సీఎంఆర్ కాలేజీ లేడీస్ హాస్టల్ బాత్ రూమ్‎లో విద్యార్థినుల నగ్న వీడియోలు చిత్రీకరించారని స్టూడెంట్స్ చేస్తోన్న ఆందోళనపై ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నారాయణ స్పందించారు. గురువారం (జనవరి 2)  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాత్ రూమ్‎లో సెల్ ఫోన్ పెట్టి తమ ప్రైవేట్ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు బుధవారం (జనవరి 1) మధ్యాహ్నం తమకు కంప్లైంట్ చేశారని ఆయన తెలిపారు. కుకింగ్ డిపార్ట్మెంట్‎లోని కొందరు అనుమానితులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

వార్డెన్ టర్మినేట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారని.. వారి కోరిక మేరకు హాస్టల్ వార్డెన్ ను విధుల నుండి తొలగించామన్నారు. ఈ విషయంలో అండగా ఉంటామని విద్యార్థునులకు హామీ ఇచ్చామని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. హాస్టల్ సీసీ టీవీ ఫుటేజ్ పోలీసులకు ఇచ్చామని.. పోలీసుల విచారణకు పూర్తిగా సపోర్ట్ చేస్తామన్నారు.


ఈ ఘటన నుండి హాస్టల్ వార్డెన్ ప్రీతిని మేం తప్పించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని.. ఇప్పటికే మేం ఆమెను టర్మినేట్ చేశామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఐదుగురు లేడి సీనియర్ స్టాఫ్‎తో కమిటీ వేసి విచారణ జరిపిస్తున్నామని తెలిపారు. స్టూడెంట్స్ మా పిల్లలతో సమానమని.. వారి భద్రతే మాకు ముఖ్యమన్నారు. నిందితులు ఎవరైనా సరే సీరియస్ యాక్షన్ తీసుకొంటామని స్పష్టం చేశారు. 

హాస్టల్ బాత్ రూమ్‎లో మొబైల్ ఫోన్లు పెట్టి తమ నగ్న వీడియోలు చిత్రీకరిస్తున్నారంటూ సీఎంఆర్ కాలేజీ విద్యార్థునులు బుధవారం ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్‎కు మద్దతుగా విద్యార్థి సంఘాలు రంగంలోకి దిగి.. కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. హాస్టల్ కుకింగ్ డిపార్ట్మెంట్‎లో కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.