కొలువుల కలలు నెరవేరుతున్న వేళ!

తెలంగాణలో యువ వికాసానికి సీఎం రేవంత్​రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాంది పలికింది.  నిరుద్యోగుల కొలువుల కలలను నిజం చేసి చూపిస్తోంది.  గతంలో ఉద్యోగాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగింది.  నిరుద్యోగులు,  ప్రజల ఆకాంక్షను  నెరవేర్చేందుకు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది.  

దశాబ్దాల తెలంగాణ ప్రజల కలను కాంగ్రెస్​ పార్టీ సాకారం చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన గత  కేసీఆర్​ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు మాత్రం కల్పించలేకపోయింది. నిరుద్యోగులను తెలంగాణ ఉద్యమంలో వాడుకొని వదిలేసింది. వారి ఉసురు తీసుకుని, ఉద్యోగాలు కల్పించకుండా నానా ఇబ్బందులకు  గురి చేసిన బీఆర్ఎస్​అధినాయకులు అన్ని వ్యవస్థలనూ కుప్పకూల్చారు.  

ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేశారు. లక్ష కోట్లతో  కాళేశ్వరం ప్రాజెక్టును కట్టానని ప్రజలను భ్రమల్లో ఉంచారు.  అవినీతితో  కేసీఆర్​ నిర్మించిన  కాళేశ్వరం కొద్ది రోజులకే  కుప్పకూలి నిర్వీర్యమైపోయింది.  సుందిళ్ల,  మేడిగడ్డ, అన్నారం  బ్యారేజ్​ల  పరిస్థితీ అంతే. 

కా ళేశ్వరంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించామని బీఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుతూ.. అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను మోస గించారు. వారి ఆగడాలను భరించలేక, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని  భావించి ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​పార్టీకి అధికారం అప్పగించారు.  2003 డిసెంబర్ 7న  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం కొలువుదీరింది.  

సకల జనుల ఆకాంక్షలకు అనుగుణంగా,  ప్రజాహితమే లక్ష్యంగా  ప్రతిక్షణం తపిస్తూ   ప్రజాపాలన సాగిస్తోంది.   ఏడాది కాలంలోనే  సీఎం రేవంత్ రెడ్డి  ప్రభుత్వం వినూత్న రీతిలో  పెద్ద ఎత్తున అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నూతన అధ్యాయం సృష్టించింది.  

55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీతో  రికార్డు

ఒక సంవత్సర కాలంలో 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను  కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసి  రికార్డు సృష్టించింది.  స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఏడాది ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన మరో రాష్ట్రం లేదు.  55 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే  కీర్తి ప్రతిష్టలు  పొందిన ప్రభుత్వంగా  రేవంత్​ ప్రభుత్వం పేరుగాంచింది.  

ఉద్యోగాల భర్తీ  వెనుక ఎంతో  కఠోర శ్రమ దాగి ఉంది.  దీనికోసం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి,  ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చాలా కసరత్తు చేశారు.  నిరుద్యోగుల కలలు నిజం చేసేందుకు అహర్నిశలు పాటుపడుతున్నారు. వారి కలలు నిజం చేసేలా 55 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. ఈ నెల నాలుగో తేదీన పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం సభలో 9,000 మంది గ్రూప్ -4 ఉద్యోగాలతో పాటు సింగరేణి  ఉద్యోగ నియామక పత్రాలను సీఎం రేవంత్​అందజేశారు.  

నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.  కానీ,  ప్రజా ప్రభుత్వం నిరుద్యోగులకు కొండంత అండగా భరోసాగా నిలుస్తున్నది.  నిరుద్యోగులను  తెలంగాణ ఉద్యమ సమయంలో  వాడుకొని వదిలేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పాలకులది. కానీ,  ప్రజా ప్రభుత్వం కేవలం 11 నెలల పాలనలోనే  నిరుద్యోగులకు దాదాపు 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలను అందించింది. ఇది కదా ప్రజా ప్రభుత్వం అని ప్రజల మెప్పు పొందుతోంది.  భారతదేశ చరిత్రనే  ప్రజా ప్రభుత్వం తిరగరాసింది.  

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

 రాష్ట్రంలో  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నది. పెద్దపెద్ద వ్యాపార దిగ్గజాలు అబ్బురపడేలా అత్యుత్తమ వ్యాపారవేత్తలుగా మహిళలను తీర్చిదిద్దేందుకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.  మహిళా అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధి,  సమాజ అభివృద్ధి అని భావిస్తూ మహిళలకు అత్యంత  ప్రాధాన్యమిస్తున్నారు.  

వడ్డీ లేని కోట్లాది రూపాయల రుణాలను అందిస్తూ స్వశక్తి మహిళలను ఆదర్శంగా తయారుచేస్తున్నారు. సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణతోపాటు అద్దె బస్సుల నిర్వహణను కూడా వారికి అప్పగించినది ప్రభుత్వం. ఇంకా వారికి ఇష్టమైన అనేక వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నది.  ప్రజలు మెచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తూ సబ్బండ వర్గాల మెప్పు పొందుతున్నది.

నాడు కేసీఆర్ కుటుంబానికి కొలువులు..  నిరుద్యోగులకు మొండిచెయ్యి

బీఆర్ఎస్ అధికారంలో ఉండగా  కేసీఆర్​తో పాటు వారి ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి.  ముఖ్య మంత్రిగా కేసీఆర్,  మంత్రులుగా హరీష్​రావు, కేటీఆర్,  ఎమ్మెల్సీగా  బిడ్డ  కవిత,  ఎంపీగా సంతోష్ కుమార్, ప్రణాళిక సంఘం  వైస్ చైర్మన్​గా వినోద్ కుమార్ పనిచేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కవిత ఓడిపోవడంతో వెంటనే కేసీఆర్ ఉద్యోగం కల్పించారు. నిరంతరం పదవిలో ఉండాలనే ఉద్దేశంతో  కవితను ఎమ్మెల్సీగా  చేశారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్  ఓడిపోయిన వెంటనే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్​గా  నియమించడం కేసీఆర్  ద్వంద్వ వైఖరికి నిదర్శనం.  

ఇంట్లోవాళ్లందరికీ ఉద్యోగాలు ఇప్పించి  నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించలేదు.  ఇది నిరుద్యోగుల పాలిట వారి కపట  ప్రేమకు నిదర్శనం. అమరవీరుల కుటుంబాలను నిలువునా ముంచిండ్రు.  తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరవీరులు ఆత్మబలిదానం చేసుకుంటే, వారి కుటుంబాలను  బీఆర్ఎస్  మోసం చేసింది. వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. డబుల్​బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదు. అన్ని రకాలుగా వారిని తీవ్ర అన్యాయానికి గురి చేశారు. అధికారంలో ఉండగా వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం శోచనీయం.

రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత కేసీఆర్​ది

గత పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని భ్రష్టు  పట్టించి రూ. 7 లక్షల కోట్ల అప్పులను చేసిన ఘనత కేసీఆర్​
 ప్రభుత్వానిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారు. లాభాల బాటలో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో  కూరుకుపోయేలా చేశారు.  బీఆర్ఎస్ చేసిన పాపాలకు ప్రజా ప్రభుత్వం పరిహారం చెల్లిస్తోంది. మరోవైపు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ  తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తోంది. 

 కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  రూ.52,118 కోట్ల రుణాలను సేకరించింది. అదే సమయంలో గత పాలకులు చేసిన రుణాలపై వడ్డీ రూ. 64,516 కోట్లు చెల్లించింది. 2014 నుంచి 2023 వరకు చేసిన లక్షల కోట్ల అప్పులు.  వాటికి చెల్లించాల్సిన వడ్డీలు.. రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమ పథకాలకు అడ్డంకిగా మారాయి. 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చేందుకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకువెళుతోంది.  ఆరు నూరైనా వెనుకడుగు వేయకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తూనే ఉంది. ఆర్థిక క్రమశిక్షణ,  పొదుపు పాటిస్తూనే ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్​ ప్రభుత్వం నెరవేరుస్తుండటం హర్షణీయం.

రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు

 రాష్ట్ర ఆదాయం నెలకు సగటున రూ.18,500  కోట్లు వస్తున్నది. ఇందులో  రూ.6,500 కోట్లు జీతాల కోసం ఖర్చు చేస్తున్నారు. మరో  రూ. 6,500 కోట్లు ఖర్చుల కింద వెళుతున్నాయి.  ఇక మిగిలిన రూ.5,500 కోట్లు అభివృద్ధి,  సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం వెచ్చిస్తోంది.  ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నా  ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 61,194 కోట్లు ఖర్చు పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెల ఒకటవ తేదీనే  ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోంది.  


అభివృద్ధి,  సంక్షేమ పథకాల అమలు కోసం నిరంతరం రేవంత్​ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.  రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. రూ.500కి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్, స్కాలర్‌‌షిప్‌‌లు తదితర పథకాలను సీఎం రేవంత్​ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది.  హాస్టల్ విద్యార్థులకు గత  బీఆర్ఎస్ సర్కార్ పది సంవత్సరాల నుంచి పెంచని డైట్ చార్జీలను కాంగ్రెస్ ప్రభుత్వం 40% పెంచింది. దీంతోపాటు కాస్మోటిక్ చార్జీలను సైతం పెంచి విద్యార్థుల జీవితాల్లో వెలుగు నింపుతున్నది.

వ్యవసాయం ఇక పండుగ

వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించింది రేవంత్​​ప్రభుత్వం.  అన్నదాతల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.  దీంతోపాటు 11 నెలలలోనే 21 లక్షల రైతుల రుణమాఫీ చేసింది.  కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుందని ఆచరించి చూపిస్తోంది  రేవంత్ రెడ్డి సర్కార్.  

రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేరుస్తోంది.  తెలంగాణలో  రైతు రాజుగా బతకాలని తాపత్రయపడుతోంది. 11 నెలల కాలంలోనే  ఇరవై ఒక్క లక్షల రైతులకు సంబంధించి 25 వేల కోట్ల రుణాలను మాఫీ చేసి చరిత్ర సృష్టించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ రైతుల కోసం ఇలా రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు.  రైతు సంక్షేమమే  లక్ష్యంగా  ముందుకు సాగుతున్నది. అన్నదాత  రుణం తీర్చుకుంటున్నది. 

హైదరాబాద్ అభివృద్ధికి గొప్ప విజన్ 

హైదరాబాద్ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప విజన్​తో ముందుకు సాగుతున్నది. వేలాది కోట్లతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే దాదాపు రూ. 5వేల కోట్ల వ్యయంతో చేపట్టే అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. వీటి ద్వారా హైదరాబాద్ కొత్త పుంతలు తొక్కనుంది.   

సికింద్రాబాద్, హైదరాబాద్ సరసన ఫ్యూచర్ సిటీని నిర్మించేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో  హైదరాబాద్​కు  గొప్ప పేరు రానుంది.  రాబోయే తరానికి మంచి ఫ్యూచర్ ఇచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు కూడా అత్యధికంగా వస్తున్నాయి.  దాదాపు రూ.50 వేల కోట్లకు పైగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకువచ్చారు. 

విద్య, వైద్యానికి పెద్దపీట

 కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోంది.  అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దారు. విద్యారంగానికి బడ్జెట్​లో  దాదాపు రూ.21 వేల కోట్లు కేటాయించింది.  డీఎస్సీ నిర్వహించి 11 వేల టీచర్  పోస్టులను భర్తీ చేసింది.  

గత సర్కారు ఒక డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయింది.  పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు,  పదోన్నతులు కల్పించింది. 40,000 మంది ఉపాధ్యాయులను బదిలీలు చేసింది. దాదాపు 21 వేల ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించింది. అలాగే వైద్యరంగంలోనూ సంవత్సర కాలంలో పదివేల కోట్లు వెచ్చించింది.  ఆరోగ్యశ్రీ కింద పదిలక్షల వరకు ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.   

దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి సర్కారు ప్రతిరోజూ18 గంటల పాటు శ్రమిస్తోంది.   ప్రభుత్వంపై బీఆర్ఎస్,  బీజేపీ నాయకులు చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలి.  పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా నిరంతరం అండగా ఉండాలి. తెలంగాణ మరింత అభివృద్ధికి అందరూ సహకరించాలి.  ప్రజలందరికీ ప్రతిక్షణం కాంగ్రెస్ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ప్రజలు కూడా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ అండగా ఉండాలి.

- జి. వివేక్ వెంకటస్వామి, చెన్నూర్ ఎమ్మెల్యే-