హైడ్రా పేరుతో సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలు: హరీశ్ రావు

  • మూసీ సుందరీకరణతో ఎవరిని ఉద్ధరిస్తరు?

సిద్దిపేట, వెలుగు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అతీగతీ లేకపోగా, రూ.లక్ష కోట్లతో ఎవరిని ఉద్ధరిద్దామని మూసీ సుందరీకణ పనులు చేపడుతున్నారని ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్​రావు మండిపడ్డారు. 

సోమవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. మూసీ సుందరీకరణ పేరుతో 25 వేల ఇండ్లను కూల్చి, నిరుపేదలను నిరాశ్రయులను చేయడం ఎంతమాత్రం తగదన్నారు. ‘‘ఎన్నో ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న పేద ప్రజలు రోడ్డున పడి కన్నీరుమున్నీరవుతున్నా సీఎం రేవంత్ రెడ్డి గుండె కరగడం లేదు. 

మూసీ సుందరీకరణ ముఖ్యమా? లేక పేదల బతుకులు ముఖ్యమా?. హైడ్రా పేరిట సీఎం రేవంత్ రెడ్డి డ్రామాలకు తెరలేపారు. ఆయనకు కూల్చడం తప్ప.. నిర్మించడం రాదు” అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధి కోల్పోయి 56 మంది ఆటో కార్మికులు చనిపోతే, ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేదని ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులకు యూనిఫామ్స్ పంపిణీ చేశారు. కాగా, ఇందిరానగర్ హైస్కూల్ విద్యార్థులకు ఇఫ్లూ సర్టిఫికెట్లను హరీశ్ రావు పంపిణీ చేశారు.