నల్గొండ జిల్లాలో సాగు, తాగునీటికి పెద్దపీట .. పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం

  • మూసీపై ముందుకు ట్రిపుల్​ ఆర్​కు చొరవ
  • సంక్షేమానికి ప్రాధాన్యం

నల్గొండ, యాదాద్రి, వెలుగు : ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ సర్కారు.. సాగు, తాగునీటికి పెద్దపీట వేసింది. దీంతో పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులకు మోక్షం కలిగింది. కాలుష్యంతో నిండిపోయిన మూసీని ప్రక్షాళన చేసి పునరుజ్జీవం చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా రీజినల్​రింగ్ రోడ్డు ఉత్తర భాగం కోసం టెండర్లు ఆహ్వానించింది. వీటితోపాటు పథకాలకు ప్రాధాన్యత కల్పించింది. స్కీమ్స్ అమలు చేయడంతో పాటు వ్యవసాయరంగానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తోంది. రోడ్లపై ఫోకస్​ పెట్టింది. దీంతో గతంలో కంటే డెవలప్​మెంట్​పుంజుకుంది. 

నల్గొండకు కలిసొచ్చిన 2024..

నల్గొండ జిల్లాకు 2024 సంవత్సరం కలిసొచ్చింది. ఎన్నో ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు 2024 లో మోక్షం లభించింది. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన బ్రాహ్మణ వెల్ల౦ల ఎత్తిపోతల పథకం ఈ ఏడాది సాకరమైంది. 2007లో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.699 కోట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్.. 2013 వరకు పనులు సాగినా పూర్తి కాలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్​ను పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రాజెక్ట్ కు రూ.1000 కోట్లతో పెండింగ్ పనులను పూర్తి చేసి జాతికి అంకితం చేసింది. ఎత్తిపోతల పథకం కింద మొదటి దశలో 48,972 ఎకరాలకు సాగునీరందించేందుకు అవసరమైన భూసేకరణ పనులు సాగుతున్నాయి. 

యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2 ప్రారంభం..

నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో దామరచర్ల మండలం వీర్లాపాలెంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్–2 విద్యుత్ ఉత్పత్తిని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మొత్తం ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టనుండగా, మొదటి స్టేజీలో 800 మెగావాట్ల యూనిట్–2 నుంచి విద్యుత్ ఉత్పత్తి మొదలైంది. 

రూ.5 వేల కోట్లతో అభివృద్ధి..

నల్గొండ జిల్లాలో రూ.5 వేల కోట్లతో రోడ్ల డెవలప్​మెంట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫండ్స్ కేటాయించారు. నల్గొండ రింగ్ రోడ్డుకు రూ.450 కోట్లు కేటాయించగా, హైదరాబాద్ -– విజయవాడ నేషనల్ హైవే పనులు ప్రారంభమయ్యాయి. నార్కెట్ పల్లి –- అద్దంకి రహదారిపై అండర్ పాస్ లకు శంకుస్థాపనలు చేశారు. మరోపక్క నల్లగొండలో 42 ఎకరాల్లో రూ.400 కోట్లతో చేపట్టిన మెడికల్ కాలేజీని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 7న  ప్రారంభించారు.

సాగు, తాగు నీటి వనరులకు రూ. 616 కోట్లు..

పెండింగ్​లో ఉన్న జిల్లాలోని బునాదిగాని కాల్వ కోసం రూ.266.65 కోట్లు, ధర్మారెడ్డి కాల్వ కోసం రూ. 123.98 కోట్లు, పిల్లాయిపల్లి కాల్వ కోసం రూ.86.22 కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. గంధమల్ల రిజర్వాయర్​నిర్మాణం కోసం కసరత్తు చేస్తోంది. బస్వాపూర్​రిజర్వాయర్​కింద బీఎన్​ తిమ్మాపురం గ్రామానికి ఆర్​అండ్​ఆర్ ప్యాకేజీ అమలులో భాగంగా రూ.50 కోట్లు మంజూరు చేసింది. తాగు నీటి కోసం వివిధ స్కీమ్స్​ కింద పనులు చేపట్టింది. మొత్తంగా రూ. 140 కోట్లు ఖర్చు చేయనుంది. 

వ్యవసాయానికి రూ. 1187.25 కోట్లు..

నాలుగు విడతల్లో దాదాపు 80 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేల మంది రైతులకు రూ.645 కోట్లు మాఫీ చేసింది. అదే విధంగా 2023-–24 యాసంగి సీజన్​లో 2,48,536 మందికి రైతు భరోసా కింద రూ.293.68 కోట్లు జమ చేశారు. ఈ ఏడాదిలో మరణించిన 494 మంది రైతులకు సంబంధించిన రైతు బీమా సొమ్ము రూ.247 కోట్లు రైతు కుటుంబాలకు అందించారు. ఆయిల్​ పామ్​సాగు చేస్తున్న రైతులకు రూ.5.51 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. సన్న వడ్లను అమ్మిన రైతులకు రూ.2.25 కోట్లు బోనస్​గా అందించింది.  

మూడు స్కీమ్స్​కు రూ.85.28 కోట్లు..

ఈ ఏడాది కాలంలో 1,43,641 మంది వినియోగదారులు గృహజ్యోతి స్కీమ్​లో జీరో బిల్లు కింద రూ.37.79 కోట్లు ఆదా చేసుకున్నారు. 1,23,753 గ్యాస్​ సిలిండర్లను అందుకున్న వినియోగదారులు సబ్సిడీ ద్వారా రూ. 12.60 కోట్లు ఆదా చేసుకున్నారు. ఫ్రీ జర్నీ కారణంగా ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే మహిళలకు లబ్ధి కలుగుతోంది. ఇప్పటివరకు జిల్లాకు చెందిన 68,80,206 మంది మహిళలు ఫ్రీ జర్నీ ద్వారా రూ.34.89 కోట్లు ఆదా చేసుకున్నారు. 

పింఛన్లు.. రోడ్లకు నిధులు..

జిల్లా వ్యాప్తంగా 1.01,340 మంది వివిధ రకాల పింఛన్లను పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా రూ.25.21 కోట్లు చొప్పున ఈ ఏడాదిలో రూ.327.73 కోట్లు పింఛన్లు అందుకున్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం రూ. 62.70 లక్షలు, గీత కార్మికులకు ఎక్స్​గ్రేషియా కింద రూ.2.11 కోట్లు అందించింది.  స్కూల్స్​లో తాగు నీటి వసతులు సహా గుర్తించిన ఇతర పనుల  కోసం రూ.23 కోట్లు ఖర్చు చేసింది. జిల్లాలోని ఆర్ అండ్ బీ రోడ్లు, పీఆర్ రోడ్ల కోసం రూ.86.31 కోట్లను మంజూరు చేసింది. పీఎంజీఎస్​వై నిధులతో రూ.17.31 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నారు. 

మూసీపై ముందడుగు..ట్రిపుల్​ ఆర్​పై చొరవ

మూసీ కాలుష్యం రాష్ట్ర రాజధాని హైదరాబాద్​కే కాదు.. ఉమ్మడి నల్గొండ జిల్లాపై ప్రభావం చూపుతోంది. కాలుష్యం విషయంలో గత సర్కారు పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేయడంతోపాటు పునరుజ్జీవం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో  భాగంగానే యాదాద్రి జిల్లా సంగెం వద్ద ఈ ఏడాది నవంబర్​ 8న సీఎం రేవంత్​ రెడ్డి మూసీ వెంట పాదయాత్ర నిర్వహించారు. చాన్నాళ్లుగా పెండింగ్​లో ఉన్న రీజినల్​ రింగ్​రోడ్డు ఉత్తర భాగం నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చొరవ తీసుకున్నారు. రూ.7104 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేసిన కేంద్రం తాజాగా టెండర్లు ఆహ్వానించింది.