ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో CM రేవంత్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్: మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. బుధవారం (డిసెంబర్ 25) ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్‎లో మెదక్ బయలుదేరిన రేవంత్ రెడ్డి నేరుగా కొల్చారం మండలం ఘనపూర్‎కు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి సీఎం రేవంత్ రోడ్డు మార్గాన మెదక్‎లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమాత ఆలయానికి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

దుర్గమాతకు సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సీఎంకు వేదాశీర్వచనాలు అందించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహా, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక మెదక్ చర్చికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.