తెలంగాణ సాంస్కృతిక రంగంపై సీఎం రేవంత్​ దృష్టి సారించాలి

వైఎస్​ రాజశేఖర్​రెడ్డి  నేతృత్వంలో  2005లో  కాంగ్రెస్ ​ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎం. సత్యనారాయణరావు  సాంస్కృతికశాఖ మంత్రిగా ఉన్నారు. అదేసమయంలో ‘వందేమాతరం’ వందేండ్ల ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా గాంధీభవన్​లోని  ప్రకాశం హాల్​లో  ‘వందేమాతర విజయం’ పేరుతో  రూపకం నడుస్తోందిఆ రూపక ప్రయోక్తగా ప్రముఖ అవధాని, ఉన్నతాధికారి, డా. రాళ్లబండి కవితాప్రసాద్​ ఉన్నారు. 

రూపకం ఆసాంతం చూసిన ఎమ్మెఎస్సార్.. ప్రయోక్తగా  కవితాప్రసాద్​ వ్యాఖ్యానం చూసి ఆనందపడ్డారు.  మీరెక్కడ పనిచేస్తున్నారు అని అడిగాడు.ఏదో డిపార్ట్​మెంట్​లో ఉన్నాను అని కవితాప్రసాద్​ చెపితే ‘నీలాంటివారు కల్చరల్​ డిపార్ట్​మెంట్’లో ఉండాలయ్యా’ అని సాంస్కృతిక శాఖలోకి తీసుకున్నారు. ఆనాటి పెద్దరికం, గుర్తింపు అలా ఉండేది.  తెలంగాణ వచ్చాక  కేసీఆర్​ చాలామందిని కవి,  గాయకులు పేరుతో అందలం ఎక్కించారు.అందులో కొందరు సమర్థులు, మరికొంతమంది  అసమర్థులు ఉన్నారు.

జీవితకాలంలో వార్డు మెంబర్​ కూడా కాని వ్యక్తులను  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  చేశారు.  గోరటి వెంకన్న లాంటి కవిని  పట్టాభిషేకం కింద ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కవి, గాయకలోకానికి  గర్వకారణం. ఈ కోవలోనే  ఎందరో  పదవులు  పొందారు. ఒక కవికి  ‘రాజకీయ పదవి’  గొప్పదని  చాలామంది అనుకుంటారు.  మరికొందరు పదవులు తమకు ఎందుకులే అని అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. అందెశ్రీకి, ఆయన గేయానికి ఇప్పటికైనా గౌరవం దక్కిందితెలంగాణ జాతీయ గీతాన్ని రచించిన అందెశ్రీకి  సీఎం ఇటీవల ఆయనకు  ఎమ్మెల్సీ ఇస్తానన్నా తీసుకోలేదన్న వార్త మనం చదివాం. అది గొప్ప విషయమే. తెలంగాణ పోరాటంలో కీలక పాత్ర పోషించినఅందెశ్రీని అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్​ దూరం పెట్టారు. ఇటీవల ఎన్నికలకు ముందు అందెశ్రీ గట్టిగానే  కేసీఆర్​పై గళమెత్తారు. ముఖ్యంగా  తన  గీతం  కేసీఆర్  సగం  రాశానని  చెప్పుకోవడం, ఆ గీతాన్ని నిరాకరించడం ఆయన కోపానికి కారణం కావచ్చు. కానీ, అతను  నిరాడంబర జీవితానికి  పోతనలాగ  ఉండే  ధిక్కార స్వరానికి జోహార్లు. రేవంత్ రెడ్డి  ప్రభుత్వం రాగానే  అందెశ్రీని  గౌరవించడమే కాకుండా  ఆ గీతాన్ని  రాష్ట్ర గీతంగా పెట్టడం మంచి పరిణామం.

కేసీఆర్​ ప్రాపకానికి లోనై..

దాదాపు 20 ఏండ్లు  కేసీఆర్​తో   కలిసి  ఎందరో  కవులు, రచయితలు,  జర్నలిస్టులు, కళాకారులు, ఉద్యమకారులు  పనిచేశారు.  అందులో  చాలామంది  నిరాశతో  పక్కకు వెళ్లిపోయినవాళ్లు,  మౌనంగా ఉండిపోయినవాళ్ళు, ఏ ప్రాపకం లేకుండా తమ  జీవితాన్ని  ముగించినవాళ్ళు ఉన్నారు. కొందరు  కేసీఆర్  నైజాన్ని  కడిగేసినవారు కూడా ఉన్నారు. ఏది ఏమైనా   కళా సాంస్కృతిక రంగాలు తెలంగాణ కోసం కాకుండా, కేసీఆర్​ కోసంలా మారాయని ఒక  అభిప్రాయం ఏర్పడింది. కాళోజీ, దాశరథి అవార్డులు,  తెలంగాణ  సాహిత్య  అకాడమీ ఏర్పాటు, అధికార భాష సంఘం, పాఠ్యపుస్తకాల ముద్రణలో భాగస్వామ్యం, 2017  తెలుగు మహాసభలు.. బుక్ ఫేర్ కమిటీ,  ప్రెస్ క్లబ్,  తెలంగాణ సారథి ఇవన్నీ  అర్హతల కంటే, కేసీఆర్​ అవసరంకొద్దీ పదవులు కొందరు పొందినవారున్నారు. తెలంగాణ సాంస్కృతిక నిష్ఠ, నిజాయితీ మాత్రమే అందుకు కొలమానం కాలేకపోయింది.

 అలాగే  జిల్లా స్థాయిలో  చాలాచోట్ల  ఏదో రకంగా  సన్మానాలు, ప్రాపకం, పలుకుబడి పొందినవాళ్లు ఉన్నారు. అయినవాళ్లకు ఆకులు.. కానివాళ్ళకు  కంచాలు అనేది కొంతభాగం ఇందులో ఉన్నా,  దాని ఆత్మను ఎవరూ కాదనలేదు.  ఇందులో మొదటి అంకం కొంతవరకు బాగానే నడిచింది. ఆ తర్వాత ఈ వ్యవస్థలకు విలువ లేకుండా పోయింది. కొందరు అర్హత లేనివాళ్లకు పదవులు రావడం. ఈ వ్యవస్థలు  విధ్వంసం కావడానికి ఒక కారణం. అయితే  కేసీఆర్  మూల లక్ష్యానికి మాత్రం వీళ్లంతా ఏదో రకంగా ఉపయోగపడినవాళ్లే.  

సీఎం ఇటువైపు దృష్టిపెట్టాలి

 పాట మనిషిని తొందరగా దగ్గరకు తీసుకుంటుంది. కాబట్టి,   ధూంధాం  కార్యక్రమాల్లో పాడిన అనేక పాటలు ఉద్యమం కోసం పనికి వచ్చాయి. ఈ పాటల  దరువుల మీద తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగింది. కేసీఆర్ పాలనలో కొంతకాలం కొనసాగినా తర్వాత కాలంలో నీరుగారిపోయింది. ఆ పరిణామాలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. కొత్తగా రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వాటి వైపు దృష్టి పెట్టలేదు. ఒక్క సంగీత నాటక అకాడమీ మాత్రం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన గొప్ప కళాకారిణి  అలేఖ్య పుంజాలకు మాత్రం ఇచ్చారు. ముఖ్యమంత్రి తక్షణం అటువైపు కూడా దృష్టి పెట్టాలి.

నివురు గప్పిన నిప్పు

సమాజాన్ని  ప్రభావితం  చేసే  సోషల్ మీడియా  ప్రాధాన్యత  పెరిగిన తర్వాత.. కవులు,  కళాకారులు విస్తృతంగా రాయడం మొదలుపెట్టిన తర్వాత ఏది నిజమైందో,  దేనికి లోతు ఉందో తెలుసుకోవడం కష్టం అయిపోయింది. మేనేజ్​మెంట్ ​పాలిటిక్స్  వచ్చిన  తర్వాత  కంటెంట్  రైటర్స్  డబ్బులకు  లభిస్తున్నందున  కవులు రచయితలు,  కళాకారుల పట్ల  గౌరవ భావం తగ్గడం సహజమే. అలాగే ప్రతివాళ్లను సిద్ధాంత దృక్కోణంతో చూడడంతో చాలామంది గొప్పవారు అయినప్పటికీ వ్యవస్థలకు దూరంగా ఉంటున్నారు. ఇది ఆరోగ్యకరమైన సమాజానికి మంచిది కాదు. 

ప్రభుత్వానికి  ఈ విషయంలో  సరైన సలహాదారులు లేకుంటే  తప్పటడుగులు పడే అవకాశం ఉంది. ఉదాహరణకు సినీకళాకారులకు  ఇచ్చే అవార్డుకు  గద్దర్  పేరు పెట్టారు.  గూడ అంజయ్యలాంటి  ఎందరో  కవులు,  పాటలు  ప్రజా గొంతుకగా మారి పాడి తెలంగాణ ప్రజల ముందు ఎగిరి గంతేశారు. కానీ, అతని పాత్ర సినిమా రంగంలో చాలా తక్కువ.  గద్దర్  పేరు మీద  సాహిత్యంలో ఒక గొప్ప అవార్డు పెడితే  బాగుండేది. జానపద   విప్లవ పాటలకు  అతని సేవ చాలా గొప్పది.   దానికి  ‘కాకతి’  అనే  పేరుతోగాని పెట్టి ఉంటే బాగుండేది. 

సిద్ధాంతాలకు అతీతంగా..

రాజకీయ పార్టీలు తమకు ఏ సిద్ధాంతం ఉన్నా.. వ్యక్తిగతంగా లోతైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను సలహాదారులుగా,  వ్యవస్థలు నడిపేవారుగా నియమించుకోవాలి. దానికి మొదట చెప్పిన ఎమ్మెస్సార్-, రాళ్లబండి కవిత ప్రసాద్ ఒక ఉదాహరణ. అలాగే,  తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రక్షాళన జరగాలి.  ఒకే వ్యక్తి  చేతిలో ఏళ్లకేళ్లు  పరిపాలన ఉండడం ప్రభుత్వాలకు అప్రతిష్ట  తెచ్చిపెడుతుంది. పెట్టేవాడు మనవాడైతే  ఏ బంతిలో కూర్చున్నా ఒకటే అన్న సిద్ధాంతం సాహిత్య, కళా రంగాల్లో పనికిరాదు.  రాజకీయ పదవులు ఎంత ముఖ్యమో సమాజానికి విలువలు నేర్పే వ్యక్తులు అంతే ముఖ్యం. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో  పదవులు  పొందినవాళ్ళు  కేసీఆర్  ప్రభుత్వానికి  మంచికన్నా  చెడు కూడా ఎక్కువ చేశారు.  వ్యక్తులలో  నిజాయితీ,  పాలనా దక్షత చాలాముఖ్యం. ఈ రంగాల్లో  అలాంటి వ్యక్తులను నిర్ణయించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

అసలైన తెలంగాణ సంస్కృతి

తెలంగాణ ప్రాంతంలో అనేక శాస్త్రాలు,  కావ్యాలు ప్రాచీనకాలం నుంచి వచ్చినా ధూంధాం పాటలకే ఎక్కువ విలువ దొరికింది.  నిజానికి తెలంగాణ  సాహిత్య,  సాంస్కృతిక వారసత్వం  రాజులను  ధిక్కరించిన  బమ్మెర  పోతన వంటి కవుల కలంలో ఉంది. ఆనాటి పరిస్థితులను లెక్కచేయకుండా ద్విపదలో అద్భుత కార్య విన్యాసం చేసిన మహా పండితుడు పాల్కురికి సోమన సాహిత్యంలో  కనిపిస్తుంది.  గంటా వ్యాఖ్యానం పేరుతో  దేశంలోని  ప్రసిద్ధ  పండితులను  తన వ్యాఖ్యానం  చుట్టూ  తిప్పుకున్న  మల్లినాథ సూరి వంటి  వ్యాఖ్యానకారుల పాండిత్య గరిమ ఉంది.  ఈ ప్రాంతంలో ఊరూరా వెలసిన  వాగ్గేయకారుల  పద సంకీర్తనల్లో ఉంది.  ఇక్కడి సామాన్య ప్రజల భాషకు పట్టంకట్టిన జానపద గేయాల సరిగమల్లో ఉంది.

- డా. పి. భాస్కర యోగి, సోషల్​ ఎనలిస్ట్-