సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో పాలన!

60 ఏండ్ల ఆకాంక్ష, ఎందరో తెలంగాణ విద్యార్థులు, యువకులు,  ప్రజల బలిదానాలతో ఏర్పడ్డ స్వరాష్ట్ర తెలంగాణలో గడిచిన దశాబ్ద కాలం కేసీఆర్  పాలన  ప్రజలు ఆశించిన పాలనకు పూర్తి విరుద్ధంగా సాగింది. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే కేసీఆర్ ప్రజల ఆశయాలను ఆకాంక్షలను తుంగలో తొక్కారు. ఉద్యమ సమయంలో తమకు తాముగా మానసికంగా  ఆత్మగౌరవంతో తమ వాహనాలకు టీజీ అనే పదాన్ని ఎవరికి వాళ్లు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే టీజీ పదాన్ని కాకుండా టీఎస్ అనే పదాన్ని అధికారికంగా అమలు చేశాడు కేసీఆర్. ఈ తెలంగాణ రాజ్యంలో  నేను చెప్పిందే శాసనం, నా కుటుంబం తప్ప మిగతావారికి ఎవరికీ మాట్లాడడానికి అధికారం లేదు అనే రీతిలో పరిపాలన సాగించాడు.  ప్రశ్నలకు, నిరసనలకు, అధికార వికేంద్రీకరణ , స్వేచ్ఛాయుత జీవన విధానం లేకుండా, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఎత్తివేసి ప్రశ్నించిన వారిని అణగదొక్కాడు.  ఆ కుటుంబంలోని ఆ నలుగురు తప్ప మంత్రులకు కూడా పవర్ లేకుండా చేసి డమ్మీలుగా చిత్రీకరించిన తీరుని తెలంగాణ సమాజం నిశితంగా పరిశీలించింది. 

అందుబాటులో ప్రభుత్వం

నిరుద్యోగుల పట్ల కనీస సానుభూతి చూపకుండా ప్రవళిక ఆత్మహత్యను కూడా అవహేళన చేసిన తీరు తెలంగాణ సమాజం మర్చిపోలేదు.  ప్రజా పాలనకు నాంది పలికిన నాటి నుంచే తెలంగాణ పునర్నిర్మాణమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి  నాయకత్వంలో  ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం, ప్రజల నుంచి విజ్ఞప్తులు సలహాలు స్వీకరించడం కోసం ప్రజావాణి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 10 ఏండ్ల కేసీఆర్ కుటుంబ పాలనలో ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ఇపుడు ప్రజా పాలనలో మంత్రులందరూ సామాన్యులకి కూడా అన్నివేళలా అందుబాటులో ఉన్న సచివాలయం  సన్నివేశాలు కాంగ్రెస్  ప్రజా పాలనలో చూస్తున్నాం. విద్యార్థి నిరుద్యోగులకు అభయమిస్తూ  టీజీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళన గతంలో ఆగిపోయిన ఉద్యోగం  నియామకాలను శరవేగంగా పూర్తి చేసి పండుగ వాతావరణంలో నియామక పత్రాలు ఒకవైపు, మరొకవైపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు నిధుల కేటాయింపు,  నూతన రేషన్ కార్డుల నియామకానికి అభ్యర్థన స్వీకరణ వంటి ఇంకెన్నో కార్యక్రమాలకు  ప్రజా పాలనలో అంకురార్పణ జరిగింది. 

రాజ్యంగ స్ఫూర్తితో పాలన

ప్రజాస్వామ్యం ఇచ్చిన  నిరసన చేసే హక్కునీ నిరాకరించి, నాడు దీక్షలు, ధర్నాలు వద్దన్నవారే ధర్నా చౌక్ ఎత్తివేసిన వాళ్లే అక్కడ ధర్నాలు చేస్తున్నారు. దీక్షలు చేస్తున్నారు. నాడు స్వరాష్ట్ర  ఉద్యమంలో తెలంగాణలో తమ వాహనాలకు పెట్టుకున్న టీజీ నేడు అధికారికంగా అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రితో అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొనడం,  కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటాల గురించి ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చించడం వంటివి చూస్తున్నాం.  గత ప్రభుత్వ 10  సంవత్సరాల పరిపాలన లో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మించడం కోసం విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల మేధావుల ప్రజాసంఘాల నాయకులకు అండగా నిలుస్తూ, సమానత్వ పునాదుల మీద   కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో  ప్రజాపాలనందిస్తున్న సీఎం రేవంత్​ అభినందనీయులు. ప్రజా పాలనంటే ఇదీ!

- వలిగొండ నరసింహా,
ఉస్మానియా యూనివర్సిటీ