జయ జయహే ప్రజా పాలన!

ఏడాది కాలం  ప్రజాపాలన ఎన్నో ఆశయాలను,  ఎన్నో  ఆకాంక్షలను,  ఎన్నో  బాధ్యతలను నిర్వర్తిస్తూ దిగ్విజయంగా సాగిపోతున్నది. తెలంగాణలో  గత రాచరిక పోకడల ఆనవాళ్లను తొలగిస్తూ  డిసెంబర్3న వెలువడిన ప్రజాతీర్పుతో  2023 డిసెంబర్ 7న  ప్రజాప్రభుత్వం కొలువుదీరింది. ఈ ఏడాది కాలంలో గత బీఆర్​ఎస్​ పాలనలో ఏం కోల్పోయామో ప్రతి పౌరుడికి మననంలోకి వచ్చింది. అందుకే,  ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంలో వాటిని సింహావలోకనం చేసుకోవడం మనందరి బాధ్యత.  ఉద్యమంలో  మనదైన అస్తిత్వాన్ని ప్రతిబింబించిన  జయ జయహే తెలంగాణ  జననీ జయకేతనం అన్న పంక్తులు నేడు రాష్ట్ర గీతంగా సగర్వంగా ప్రతి అధికారిక వేదికపై  కోట్లాది గళాలుగా వినిపిస్తున్నాయి. నాడు  వాహనాలపై  రాసిన టీజీ అన్న రాతలు నేడు అధికారికమై దర్శనమిస్తున్నాయి. చాకలి ఐలమ్మ,  సురవరం ప్రతాపరెడ్డి పేర్లు  విశ్వవిద్యాలయాలయ్యాయి.  

గత బీఆర్​ఎస్​ పాలన కాలంలో  కేవలం 7,857 టీచర్  కొలువులు ఇస్తే.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన ఆరునెలల్లోనే 11,062  టీచర్ పోస్టులు మన యువతకు ఇచ్చింది. 563  భారీ పోస్టులతో  తొలి  తెలంగాణ  గ్రూప్1 పరీక్షలను ఎలాంటి ఆటంకం లేకుండా ప్రజాప్రభుత్వం నిర్వహించింది.  8,300కు పైగా రెసిడెన్షియల్ ఉద్యోగాలు, 16,060కి పైగా పోలీస్ జాబులు, సింగరేణిలో కారుణ్య నియామకాలు, 7,090కిపైగా మెడికల్ ఉద్యోగాలు, టీజీపీఎస్సీ ద్వారా 3,400 వరకూ ఇలా అనేక ఉద్యోగాలను ఎలాంటి  అడ్డంకులు లేకుండా, కోర్టుల్లో సమర్థంగా వాదిస్తూ మన తెలంగాణ బిడ్డలకు అందించింది.  ఇలా   కేవలం తొమ్మిదినెలల కాలంలోనే 53వేలకు  పైగా ప్రభుత్వ ఉద్యోగాలను  భర్తీ చేసింది ప్రజా ప్రభుత్వం. అంతేకాకుండా, ఏ అర్హుడికీ నష్టం రానీయకుండా జాబ్ క్యాలెండర్  ప్రకటించడం గమనార్హం.  కేవలం ప్రభుత్వ  ఉద్యోగాల కల్పనే కాదు, ప్రైవేటు రంగంలోనూ అపార ఉద్యోగాల కల్పనను సాధించి పెట్టింది, దావోస్, యూఎస్, ఉత్తర కొరియా వంటి పర్యటనల ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, తొలి నెలల్లోనే 15వేలకు పైగా ఉద్యోగాలను అందించే ఫాక్స్ కాన్ ప్రారంభం, కాగ్నిజెంట్ శంకుస్థాపన వంటి అనేక పరిశ్రమలను ప్రారంభించింది. 

విద్యాభివృద్ధికి పెద్దపీట 

ప్రపంచస్థాయి ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఇండస్ట్రీకి కావాల్సిన నైపుణ్యాలు నేర్పేలా వారినే భాగస్వామ్యం చేస్తూ దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా వంటివారిని వర్సిటీకి చైర్మన్​గా ఉండడానికి ఒప్పించింది ప్రభుత్వం.  దీంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ,  పోలీస్ స్కూల్,  బీఎఫ్ఎస్​ఐ కోర్సులు, విద్యాకమిషన్, యూనివర్సిటీలకు పూర్తిస్థాయి విసీలు , ప్రీ స్కూల్స్, 64 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్, ఐఐహెచ్టీ, ప్రతిష్టాత్మక టాటా సంస్థలతో  కలిసి ఏటీసీలుగా  ఐటీఐల అప్ గ్రేడేషన్, పాఠశాల ప్రారంభమైన తొలి రోజునే పుస్తకాలు, యూనిఫామ్స్ అందించడం తెలంగాణకు ఒక శుభారంభం.  గతంలో బాత్రూంలు కూడా లేని  అనేక స్కూళ్లలో  మౌలిక వసతుల కల్పనకు వందలాది కోట్లు కేటాయించింది. లాంగ్ రన్​లో   దేశ,  రాష్ట్ర ప్రగతికి బాటలు వేసే విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టింది  ప్రజాప్రభుత్వం. 

ఆరోగ్య భద్రత

తొలిరోజే రూ.10 లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని  పెంచడంతోపాటు, 8 మెడికల్ కళాశాలలు సాధించడం, మెడికల్ ఇన్ఫ్రా డెవలప్​మెంట్,  ప్రత్యేకంగా వైద్య విధాన పరిషత్​లో  ఉద్యోగ నియామకాలు,  నిమ్స్​లో  అందించే అన్ని అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సేవల్ని సైతం ఉచితంగా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవడం జరిగింది.  జిల్లా, మండల,  గ్రామ వైద్యాలయాల్లో సిబ్బందిని, సామగ్రి కొరత లేకుండా చూడడం ద్వారా  వైద్యరంగం తమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నదో  చెప్తున్నది ప్రజా ప్రభుత్వం. అతి త్వరలో తెలంగాణ పౌరుల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్​ రూపొందించి ప్రపంచంలో  ఏమూలకు వెళ్లినా  మన ఆరోగ్య సమాచారాన్ని అరచేతిలో దర్శించేవిధంగా చేస్తున్నది.  

మెరుగవుతున్న ఆర్థిక పరిస్థితి 

7లక్షల కోట్లకు పైగా అప్పుతో ప్రారంభమైన పాలనలో నెల నెల జీతాలు,  మిత్తీ కిస్తీలకే 12వేల కోట్లకు పైగా ఖర్చవుతున్నా... ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఆగనీయకుండా సమర్థ పాలన చేస్తున్నారు సీఎం  రేవంత్ రెడ్డి.    ప్రజాపాలన అభయహస్తం  దరఖాస్తులను తీసుకొని అర్హులందరికీ  ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ కోసం 21వేల కోట్లు, ఆడబిడ్డల స్వావలంబనలో భాగమైన ఉచిత బస్సు ప్రయాణానికి 3 వేల కోట్లు,  రూ.500కే  సిలిండర్​ అందిస్తూ 500కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్​ కోసం వేయి కోట్లు, రూ.7200  కోట్ల మొదటివిడత  రైతుభరోసా, ఉచిత విద్యుత్ ఇలా  ప్రతి సంక్షేమ పథకాన్ని కొనసాగిస్తూనే తమ హామీల అమలుపై నిర్దిష్ట  కార్యాచరణతో ముందుకువెళ్తున్నారు. 

ఇందిరా మహిళా శక్తి

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే సంకల్పంతో  సహకార రుణాలు, మహిళా స్వావలంబన కోసం ఇందిరా మహిళా శక్తి పథకం కింద సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు,  సోలార్ బస్సుల నిర్వహణ వంటివి అందజేస్తున్నారు.  వ్యవసాయ కమిషన్  ఏర్పాటు చేసి  రైతన్నల లాభసాటికి ప్రణాళికలు రచిస్తున్నారు. కాళేశ్వరం పేరుతో గతంలో దోచిన లెక్కల్ని కమిషన్ వేసి తేలుస్తూనే.. నేడు అది లేకుండానే పుట్లకొద్దీ రాశుల ధాన్యాన్ని పండించిన తెలంగాణ రైతన్నకు అండగా మద్దతు ధరతో పాటు, సన్నాలకు 500 బోనస్ ఇస్తూ కొంటున్నారు.  మరోవైపు సాగునీటి ప్రాజెక్టులపై  నిరంతరం రివ్యూలు చేస్తూ,  రైతుల దిగుబడులను పెంచాలనే లక్ష్యంతో వేగంగా పూర్తి చేసే సంకల్పంతో  పనిచేస్తున్నారు.  

ఆర్థిక, సామాజిక బలహీన వర్గాలకు న్యాయం

మేమెంతో  మాకంత అని  నినదిస్తున్న  బీసీలకు న్యాయం చేయడానికి కులగణన చేస్తూనే కొత్తగా 17 కులాలకు  కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి న్యాయబద్ధమైన  వాటాను  అందించే  దిశలో  రేవంతన్న  ప్రజాప్రభుత్వం అహర్నిశలూ శ్రమిస్తోంది. నేతన్నలతోపాటు  కాటమయ్య రక్షణ కవచాలు,  ఇతరత్రా సబ్సిడీలతో ప్రతి బలహీనవర్గం  స్వావలంబనకు  కృషి చేస్తోంది. ఇక పేదోడి కల సాకారానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చి  ప్రతి నియోజకవర్గానికి  3,500 ఇండ్లతో  నాలుగున్నర లక్షల కుటుంబాలకు  సొంతింటిని అందించనుంది.

సాంస్కృతిక రంగానికి ప్రాధాన్యత

అధికారం చేపట్టిన  తొలినాళ్లలోనే  ఇంద్రవెల్లి స్థూపం సందర్శించి ఘన నివాళితో అభివృద్ధి చేస్తున్నారు.  కవులు,  కళాకారులకు గద్దర్ అవార్డులు,  గద్దరన్న విగ్రహం, జయంతి  అధికారికంగా  నిర్వహిస్తూనే సాంస్కృతిక  సారథికి ఆయన వారసురాలినే  నియమించింది ప్రజా ప్రభుత్వం.  పద్మ పురస్కారాలు అందుకున్న మన తెలంగాణవారికి ఆర్థిక చేయూత, సినారే,  దాశరథి జయంత్యుత్సవాలు  ఇలా కళా,  సాంస్కృతిక రంగాల్లో మనదైన  అస్తిత్వాన్ని చాటుతోంది.  తద్వారా  సుస్థిర అభివృద్ధికి  బాటలు పరిచే పర్యాటక రంగానికి ఊతం ఇస్తోంది.

 రాజధాని అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

నాడు రాజీవ్ హయాంలో వేసిన ఐటీ పునాదులతో  నేడు విశ్వవ్యాప్తంగా  మన సత్తా ఏంటో చాటుతోంది. రాష్ట్రం మొత్తం అభివృద్ధి సాధించేలా ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని ఉపయోగించుకొని దానికి అటు ఇటూ ప్రత్యేక జోన్ల వారీగా ఫార్మా, అటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్ ఇలా అనేక పారిశ్రామిక కారిడార్లను నిర్మిస్తోంది.  టూరిజం రంగంలోనూ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంలను రూపొందిస్తోంది. ఫోర్త్ సిటీ, మూసీ పునరుజ్జీవం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టులు అటు పారిశ్రామిక ప్రగతితో పాటు టూరిజం రంగంలోనూ మన రాష్ట్రానికి విస్తార అవకాశాల్ని తెచ్చిపెట్టబోతున్నాయి.  తెలంగాణ  ప్రయోజనాలే  లక్ష్యంగా  ప్రజాపాలన కొనసాగుతు
న్నది. ఈ శుభతరుణంలో  ప్రజా సంబురాల్లో  ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి.  జై తెలంగాణ! 

ఏకకాలంలో రూ.2లక్షల రైతుల రుణమాఫీ

 గడిచిన ఏడాదిలో  విదేశీ పర్యటనలు, అధికారిక పర్యటనలు మినహా మిగతా సమయమంతా  సచివాలయంలో అందుబాటులో ఉన్నారు రేవంత్ రెడ్డి.  ఆయన మంత్రివర్గం సైతం జిల్లాల్లో పర్యటిస్తూ తమ శాఖలపై స్వేచ్చగా సమీక్షలు నిర్వహిస్తూ  ప్రజా పాలనకు అంకితమయ్యారు.  జిల్లా స్థాయితో పాటు  ప్రజాభవన్​లో  నిర్వహించే ప్రజావాణిల ఫిర్యాదులను ఆన్​లైన్​ చేసి వాటి పరిష్కారం ఎంతవరకూ వచ్చిందో తెలుసుకునే అవకాశం ప్రజలకు ఇచ్చింది. 

- బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి,
సీఈవో,
టిసాట్ నెట్​వర్క్