కుల గణన సర్వే 98 శాతం కంప్లీట్: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే 98 శాతం పూర్తి అయ్యిందని.. మరో రెండు శాతం మిగిలి ఉందని చెప్పారు. మిగిలిన రెండు శాతం పూర్తి అయితే తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కులగణన తెలంగాణ ప్రజల మెఘా హెల్త్ ప్రొఫైల్‌ లాంటిదన్నారు.

హైదరాబాద్‌లో నిర్మించిన కురుమ విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ – దొడ్డి కొమురయ్య ఆత్మ గౌరవ కురుమ భవనాన్ని శనివారం (డిసెంబర్ 14) సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకార్లను గ్రామాల్లోకి రాకుండా, దొరల పెత్తనాన్ని అడ్డుకోవడానికి దుడ్డుకర్రల సంఘం పెట్టి పోరాడిన గొప్ప యోధుడు దొడ్డి కొమురయ్య అని కొనియాడారు.

ALSO READ | రానున్న రోజుల్లో ఆ పంటతో అధిక లాభం: రైతులకు మంత్రి తుమ్మల సూచన

చాకలి ఐలమ్మ పేరును యూనివర్సిటీకి పెట్టినట్టుగానే.. దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా మంత్రివర్గ సహచరులతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దొడ్డి కొమురయ్య భవన ప్రాంగణం ఒక విద్యా వేదిక కావాలని.. విజ్ఞానం పంచాలని సీఎం ఆకాంక్షించారు. కురుమ సోదరులకు విద్య కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ, సన్నాలకు బోనస్, ఉచిత విద్యుత్, రూ.500 లకే సిలిండర్, పేదలకు వైద్య సౌకర్యాలు అందించడం వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా బలహీన వర్గాలకు అందాయని పేర్కొన్నారు.