ఢిల్లీ సీఎం రేవంత్ బిజీబిజీ.. కేంద్రమంత్రులతో భేటీ

ఢిల్లీ సీఎం రేవంత్ బిజీబిజీ..  కేంద్రమంత్రులతో భేటీ

న్యూఢిల్లీ, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి శనివారం పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఈ మేరకు పలు శాఖల మినిస్టర్ల అపాయింట్ మెంట్ ను సీఎంవో కోరినట్టు తెలిసింది. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్–23లోని తన అధికారిక నివాసానికి వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ ఇంటిని ఖాళీ చేసిన తర్వాత, అక్కడ చేపట్టిన మరమ్మతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం యమునా క్వార్టర్స్ లోని తన నివాసానికి వెళ్లారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు చేరుకుని రేవంత్ తో భేటీ అయ్యారు.  

రెండ్రోజులు బిజీబిజీ.. 

రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉండనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, గజేంద్ర సింగ్ షెకావత్ లతో రేవంత్ సమావేశమయ్యారు. రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తదితరులను కలిసే అవకాశం ఉంది. అయితే వీకెండ్ కావడంతో పలువురు కేంద్రమంత్రులు సొంత నియోజకవర్గాల్లో ఉన్నట్టు తెలిసింది. కాగా, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర ముఖ్య నేతలను ఆయన కలవనున్నారు. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, లోక్ సభ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలిసింది. అలాగే దావోస్ పర్యటన వివరాలను హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. 

దావోస్ నుంచి లండన్ కు.. 

రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ఆదివారం మణిపూర్ లో ప్రారంభం కానుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇందుకోసం శనివారం రాత్రి ఆయన కోల్ కతా వెళ్లనున్నారు. అక్కడి నుంచి మణిపూర్ వెళ్లనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ యాత్రలో రాహుల్ తో కలిసి రేవంత్ కొద్దిదూరం నడవనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన ఆదివారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి నేరుగా దావోస్ వెళ్లనున్నట్టు సీఎంవో వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నెల 15 నుంచి 18 వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ వేదికగా జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో రేవంత్ పాల్గొననున్నారు. ఆయనతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు దావోస్ కు వెళ్లనున్నారు. ఈ సదస్సులో గ్లోబల్ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీ ప్రతినిధులను కోరనున్నారు. కాగా, దావోస్ సదస్సు తర్వాత రేవంత్ లండన్ లో పర్యటించనున్నట్లు తెలిసింది. ఈ నెల 20న తిరిగి హైదరాబాద్ రానున్నారు.