సినిమాలు తీసుకోండి.. సంపాదించుకోండి.. చట్టాన్ని అతిక్రమిస్తే తాటతీస్తా : సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్


సినిమా పరిశ్రమకు తమ సహకారం ఉంటుందని, అభివృద్ధికి సహకరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ చట్టానికి అతీతంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోడం.. బాబు కోమాలో ఉండటం చాలా దయనీయమైన పరిస్థితి అని సీఎం రేవంత్ ఆదేవన వ్యక్తం చేశారు. కానీ కనీసం బాబును  పరామర్శించడానికి ఇప్పటి వరకు హీరో వెళ్లలేదని.. హీరోకు ఏం బాధ్యత ఉందని సీఎం అన్నారు.

 వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి కంట్రోల్ తప్పిందని, ఘటన జరిగిన తర్వాత డిజీపీ పోలీసులు బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ చేతులు ఊపారని తెలిపారు. థియేటర్ లో కూర్చున్నాక కూడా కామ్ గా కూర్చోలేదని, లేచి నలబడి చేతులు ఊపడం చేశారని.. దీంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కష్టమైపోయిందని సీఎం తెలిపారు. హీరో రోడ్ షో నిర్వహించడం వల్లనే ఘటన జరిగిందని, అందుకే అల్లు అర్జున్ పై కేసు పెట్టాల్సి వచ్చిందని సీఎం తెలిపారు. 

  ఇలాంటి ఘటనలపై కూడా పార్టీలు రాజకీయం చేయాలని చూశాయని సీఎం అన్నారు. విచిత్రమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి వ్యతిరేకత క్రియేట్ చేయాలని చూశారని సీఎం అన్నారు.   ఈ ఘటనపై ఒకాయన ట్విట్టర్ లో పెట్టి వ్యతిరేక ప్రచారం చేయాలని చూశారని పరోక్షంగా కేటీఆర్ ను విమర్శించారు.  హీరో భగవత్ స్వరూపుడు.. ఆయన మీద చేయి వేయకూడదు.. అన్నట్లు వీళ్ల వ్యవహారం ఉందని సీఎం అన్నారు. మళ్లీ వీళ్లు ఉద్యమాలు చేశామని చెప్తారని విమర్శించారు. తల్లి చనిపోయి.. కొడుకు కోమాలో ఉంటే.. దీనిపై కూడా రాజకీయం చేయాలని చూశారని.. వీళ్లకు కనీసం మానవత్వం కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

 ఆ సినిమాతో తమకేం వస్తుందని,  స్పెషల్ షో లు వేసుకోడానికి అనుమతించిందే తమ ప్రభుత్వమని, సినిమాలను ఎంకరేజ్ చేయడానికి కదా పర్మిషన్ ఇచ్చిందని అన్నారు. ఒకవేళ సినిమా స్టార్స్ ను అరెస్టు చేయొద్దంటే.. కేసులు పెట్టొద్దంటే.. సూపర్ స్టార్స్ పైన ప్రత్యేక ప్రివిలేజ్ పెడదామా చెప్పండని ప్రశ్నించారు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్లొస్తే ఆయనకు ఏదో యాక్సిడెంట్ అయినట్లు క్యూ కట్టారని.. కనీసం ఒక్క రోజైనా పిల్లోడిని పరామర్శించారా..? అని ప్రశ్నించారు. 

సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచిస్తున్నారో తమకు అర్థం కావడం లేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. సంపాదించుకోండి.. అభివృద్ధి చేయడానికి మేము కూడా సహకరిస్తాం.. కానీ చనిపోయినా కూడా చూస్తూ కూర్చోవాలంటే ఊరుకోమని.. చట్టానికి అతీతంగా వ్యవహరిస్తామంటే తమ ప్రభుత్వం సహించదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.