మార్చి 31 లోపు గ్రూప్ 1.. ఒక్క ఏడాదిలో 55 వేల 143 ఉద్యోగాలు: సీఎం రేవంత్ రెడ్డి

మార్చి 31 లోపల 563 నియామకాలు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదని, తమ ప్రభుత్వం నిబద్ధతతో అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నియామకాలు జరుపుతోందని అన్నారు. ప్రగతి భవన్ లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీంను సీఎం ప్రారంభించారు. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థికసాయం అందజేశారు. 

ఒకే ఏడాదిలో 55 వేల 143 ఉద్యోగాలు

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం నియామకాల సమస్యపైన నడిచిందని, అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఏడాదిలో విజయవంతంగా 55 వేల 143 ఉద్యోగాలు నియమించడం జరిగిందని అన్నారు. మొదటి సంవత్సరంలో ఇన్ని ఉద్యోగాలు నియమించడం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే మొదటి సారి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సివిల్స్ లో ఎక్కువ మంది ఎంపిక కావాలనేది తమ లక్ష్యమని, అందుకోసం అభ్యర్థులను అన్ని విధాల ప్రోత్సహిస్తామని అన్నారు.

వెనుక బడిన బీహార్ రాష్ట్రం నుంచి సివిల్స్ ఉద్యోగులు అధికంగా ఉన్నపుడు.. తెలంగాణ నుంచి ఎందుకు ఉండకూడదని సీఎం రేవంత్ అన్నారు. అక్కడ ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లనే సాధ్యమయిందని అన్నారు. తమ ప్రభుత్వం కూడా సివిల్స్ లాంటి ఉద్యోగాలలో తెలంగాణ నుంచి ఎక్కువ మందిని ఎంపిక అయ్యే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అందుకే అభ్యర్థులను ప్రోత్సహించేందుకు నగదు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.

Also Read :- సింగరేణిని రాజకీయాలకు వాడం.. బలమైన ఆర్థిక శక్తిగా మారుస్తాం

అందులో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని సింగరేణి తరఫున ఇద్దామని డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్గ ముందుకు వచ్చారని గుర్తు చేశారు. ఇది ఆర్థిక సహాయం అనేకంటే.. అభ్యర్థుల విజయాలకు ప్రోత్సాహకంగా భావించాలని కోరారు.

అభ్యర్థులు సివిల్స్ కు సెలెక్ట్ అయ్యి తెలంగాణ రాష్ట్రానికి సేవలు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రిపేర్ అవుతున్న, ఎంపికైన అభ్యర్థులు అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని.. అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.  భవిష్యత్తులో సివిల్స్ కు సెలెక్టు అయ్యే అభ్యర్థులు ఎక్కువ ఎక్కడ అంటే అది తెలంగాణలోనే అని చెప్పుకునేలా తయారు కావాలని ఆకాంక్షించారు.

త్వరలో గ్రూప్ 1 నియామకాలు:

ఉమ్మడి రాష్ట్రంలో2011లో గ్రూప్ 1 నియామకాల కోసం నోటిఫికేషన్ వస్తే 14 ఏండ్లైనా పూర్తి కాలేదని.. దీని వలన అభ్యర్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యిందని అన్నారు. ఇలాంటి పరిస్తితులలో 563 గ్రూప్ 1 పోస్టుల ఖాళీలలను రాబోయే రెండు నెలల్లో నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు. మార్చి 31 లోపల 563 నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు. 

ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇది సాధ్యం కాలేదని, తమ ప్రభుత్వం నిబద్ధతతో అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నియామకాలు జరుపుతోందని అన్నారు. ఈ నియామకాలను అడ్డుకోవాలని చూస్తున్నారని.. అన్ని చిక్కుముడులను విప్పుకొని ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. తమ ప్రభుత్వం యువత కోసం ముందుకెళ్తోందని.. యువత సహకరించాలని కోరారు. క్యాలండర్ ఇయర్ ప్రకారం నియామకాలు జరుపుతామని ఈ సందర్భంగా తెలిపారు.