విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం : సీఎం రేవంత్​రెడ్డి

  • కొంతమంది ఉన్మాదంతో అలజడి సృష్టిస్తున్నరు
  • అలాంటి వాళ్లను వదిలే ప్రసక్తే లేదు: సీఎం రేవంత్​రెడ్డి
  • బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్.. క్రిమినల్స్​కు కాదు
  • నేరాలకు పాల్పడేవాళ్లు ఎంతటివారైనా చర్యలు తప్పవు
  • పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
  • రాష్ట్రంలో డ్రగ్స్​, గంజాయి మూలాలు లేకుండా చేయడమే లక్ష్యమని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు : శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్‌‌రెడ్డి హెచ్చ రించారు. ‘‘కొంతమంది ఉన్మాదంతో మందిరాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నరు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సమాజంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నరు. అలాంటివాళ్లను ఎట్టిపరిస్థితుల్లో వదలబోం’’ అని తేల్చిచెప్పారు.

సికింద్రాబాద్‌‌లోని ముత్యాలమ్మ గుడి వద్ద జరిగిన సంఘటనతో పాటు ఇటీవలి కాలంలో జరిగిన మరికొన్ని ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేవారి విషయంలో ప్రజలు మరింత సంయమనంతో వ్యవహరించాలని ఆయన కోరారు. ‘‘తెలంగాణ సమాజం ఎంతో తెలివైంది. మతవిద్వేషాలను అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరిస్తుంది” అని తెలిపారు.

‘‘ఫ్రెండ్లీ పోలీసింగ్ క్రిమినల్స్‌‌తో కాదు.. న్యాయం కోసం వచ్చే బాధితులకు మాత్రమే. ఈ విషయంలో పోలీసులకు క్లారిటీ ఉండాలి. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దు. వివిధ మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించడంలో, సైబర్​ నేరాలను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసుల కృషి మరవలేనిది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్​ల్యాబ్​ కూడా ఇతర రాష్ట్రాలకు  ఆదర్శంగా నిలిచింది” అని సీఎం రేవంత్​ తెలిపారు. 

ఖద్దరు, ఖాకీలను సమాజం గమనిస్తది

‘‘ఖద్దరు, ఖాకీలను సమాజం గమనిస్తూ ఉంటుంది. ప్రభుత్వ గౌరవం పోలీసుల చేతుల్లోనే ఉంది. పోలీసులు ఎవరి ముందో చేయి చాచే పరిస్థితి ఉండకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌తో పాటు ప్రభుత్వం పరువు పోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. బందోబస్తు విధుల్లో ఉండే పోలీస్‌‌ సిబ్బందికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత పదేండ్లలో డ్రగ్స్, గంజాయి దందా పెరిగిపోయిందని..-మాదక ద్రవ్యాలు,సైబర్‌‌‌‌ క్రైమ్‌‌ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇప్పటికే పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్​పెరిగిపోయి విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి రావద్దన్న ఉద్దేశంతోనే మాదకద్రవ్యాలను అరికట్టేందుకు టీజీ యాంటీ నార్కొటిక్స్‌‌ బ్యూరో ఏర్పాటు చేశామని, దానికి డీజీ స్థాయి అధికారిని నియమించామని వివరించారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి మూలాలు లేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. 

హైదరాబాద్​లో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌ టెక్నాలజీని వినియోగిస్తామని వెల్లడించారు. కార్పొరేట్ స్థాయిలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌‌ను ప్రారంభిస్తున్నామని, అందులో పోలీస్​ కుటుంబాల్లోని పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యాభ్యాసం ఉంటుందని ఆయన తెలిపారు.

గ్రేహౌండ్స్‌‌ జూనియర్ కమాండో ప్రవీణ్‌‌ కుటుంబానికి భరోసా

ఈ ఏడాది ఫిబ్రవరి 11న జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా అటవీ ప్రాంతంలో నిర్వహించిన కూంబింగ్‌‌ ఆపరేషన్‌‌ టైంలో ఎలక్ట్రిక్‌‌ షాక్‌‌తో గ్రేహౌండ్స్‌‌ జూనియర్‌‌ కమాండో ఆది ప్రవీణ్‌‌ మృతి చెందగా.. ఆయన కుటుంబాన్ని రేవంత్‌‌రెడ్డి పరామర్శించారు.

ఆది ప్రవీణ్‌‌ భార్య లత, కుమారులు ఆది హర్ష, ఆది వివాన్‌‌కు పోలీస్‌‌ స్మారక చిహ్నం జ్ఞాపికను అందించారు. ప్రస్తుతం ఔట్‌‌ సోర్సింగ్‌‌ ఉద్యోగం చేస్తున్న లతకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం  హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్‌‌ చీఫ్‌‌ శివధర్‌‌రెడ్డి, సీఐడీ డీజీ శిఖాగోయల్‌‌, అడిషనల్‌‌ డీజీలు మహేశ్‌‌ భగవత్‌‌, సంజయ్‌‌కుమార్‌‌ జైన్‌‌ తదితరులు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌‌రెడ్డికి ధన్యవాదాలు : రాష్ట్ర పోలీస్‌‌ అధికారుల సంఘం

పోలీస్‌‌ అమరుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా పెంచుతున్నట్టు ప్రకటించినందుకు సీఎం రేవంత్‌‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌‌ అధికారుల సంఘం ధన్యవాదాలు తెలిపింది.ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌‌ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసుల సమస్యల పరిష్కారానికి  సీఎం రేవంత్‌‌రెడ్డి హామీ ఇవ్వడంతోపాటు పోలీసు అధికారులు, సిబ్బంది పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూల్​ ఏర్పాటు చేస్తుండడం సంతోషకరమని పేర్కొన్నారు.

ఎక్స్​గ్రేషియా పెంపు 

విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారికి ఎక్స్​గ్రేషియాను పెంచుతున్నట్లు సీఎం రేవంత్​ ప్రకటించారు. డ్యూటీలో మృతిచెందిన కానిస్టేబుల్‌, హెడ్‌కానిస్టేబుల్‌, ఏఎస్‌ఐ ర్యాంకు పోలీసులకు ఇకపై రూ.కోటి.. ఎస్‌ఐ, సీఐలకు  రూ.1.25 కోట్లు.. డీఎస్పీ, ఏఎస్పీలకు రూ.1.50 కోట్లు.. ఎస్పీ స్థాయి నుంచి ఐపీఎస్‌ స్థాయివారికి రూ.2 కోట్లు ఎక్స్​గ్రేషియా ఇస్తామని ఆయన వెల్లడించారు. శాశ్వత అంగవైకల్యానికి గురైన పోలీస్‌ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్ఐలకు రూ.50 లక్షలు..

ఎస్‌ఐ, ఇన్‌స్పెక్టర్‌‌, డీఎస్పీ, ఏఎస్పీ స్థాయి అధికారులకు రూ.60 లక్షలు.. ఐపీఎస్‌లకు రూ.కోటి చొప్పున అందిస్తామన్నారు. గాయపడినవారిలో కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్పీ వరకు రూ.10 లక్షలు.. ఎస్పీ ఆపైస్థాయి అధికారులకు రూ.12 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇటీవల మృతి చెందిన ఐపీఎస్‌ రాజీవ్‌రతన్‌ కుమారుడికి గ్రేడ్‌-2కింద మున్సిపల్‌ కమిషనర్‌గా, కమాండెంట్‌ మురళి కుమారుడికి డిప్యూటీ ఎమ్మార్వోగా ఉద్యోగాలు ఇచ్చామని, ఇంటి స్థలం కూడా ఇస్తున్నామని ఆయన చెప్పారు.

ఖద్దరు, ఖాకీలను సమాజం ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ప్రభుత్వ గౌరవం పోలీసుల చేతుల్లోనే ఉంది. పోలీసులు ఎవరి ముందో చేయి చాచే పరిస్థితి ఉండకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా పోలీస్ డిపార్ట్‌‌మెంట్‌‌తో పాటు ప్రభుత్వం పరువు పోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేరాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించొద్దు. వివిధ మతాల పండుగలను శాంతియుతంగా నిర్వహించడంలో, సైబర్​ నేరాలను అదుపు చేయడంలో రాష్ట్ర పోలీసుల కృషి మరువలేనిది. రాష్ట్రంలోని ఫోరెన్సిక్​ ల్యాబ్​ కూడా ఇతర రాష్ట్రాలకు  ఆదర్శంగా నిలిచింది.

- సీఎం రేవంత్​రెడ్డి