కేసీఆర్​ ఆర్థిక నేరస్తుడు .. ధరణితో మన రైతుల డేటా విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టిండు: సీఎం రేవంత్

  • అలాంటి వ్యక్తికి ఏ శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలి
  • కాగ్ వద్దన్న సంస్థకే పోర్టల్​ను అప్పగించిండు
  • వాళ్లు ఒక్క క్లిక్ చేస్తే మన డేటా ఖతమైతది
  • బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు.. వేల ఎకరాలు బదలాయించుకున్నరు
  • రైతులకు ఉపయోగపడేలా భూ భారతి చట్టం తెస్తుంటే అడ్డం పడుతున్నరు
  • ఫార్ములా–ఈ రేసు రద్దుతో 600 కోట్ల నష్టాన్ని ఆపినం 
  • దీనిపై బీఆర్ఎస్ ఆఫీసులోనైనా చర్చకు సిద్ధమని సవాల్

హైదరాబాద్, వెలుగు: ధరణితో ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మన రైతుల డేటా మొత్తం విదేశీ వ్యక్తుల చేతుల్లో పెట్టారని ఫైర్ అయ్యారు. ‘‘రెవెన్యూ శాఖ, రైతుల మధ్య ఉండాల్సిన భూముల వివరాలను విదేశీయులకు అప్పగించడం ద్వారా ఆనాటి సీఎం కేసీఆర్ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. వాళ్లు అక్కడి నుంచి ఒక్క క్లిక్ చేస్తే మన సర్వర్లు క్రాష్​అయ్యి, మన డేటా ఖతమైపోతుంది. 

ఇలాంటి పని చేసిన వ్యక్తికి ఎంతటి కఠినమైన శిక్ష వేయాలో చట్టాలను చదవాల్సిన అవసరం ఉంది’’ అని అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో  భూభారతి బిల్లుపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్నోళ్లలో మన దేశానికి చెందినోళ్లు ఎవరూ లేరని, విదేశీ వ్యక్తుల చేతుల్లో మన రైతుల భూముల వివరాలు పెట్టారని బీఆర్ఎస్ పై మండిపడ్డారు. ‘‘రెవెన్యూ డిపార్ట్ మెంట్, భూయజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నెపంతో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టారు. 

మన రాష్ట్రంలో ఎంసీహెచ్ఆర్డీలో అద్భుతమైన సాంకేతికత ఉన్నా.. ప్రజలకు ద్రోహం చేసి సంపూర్ణ సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారు. ఆనాడు కేసీఆర్ ఆవేశంతో ఊగిపోతుంటే నాకు అర్థం కాలేదు.. దీని వెనుక ఇంత ఉందని తెలియలేదు” అని చెప్పారు. ‘‘ధరణి పోర్టల్ నిర్వహణకు సంబంధించిన అగ్రిమెంట్ లోని 9.20 క్లాజ్ ప్రకారం.. యజమాని పేరు మార్చడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 

Also Read :- దేశంలోనే ధరణి పెద్ద స్కామ్

9.20.4 క్లాజ్ ప్రకారం.. ప్రభుత్వ ఆఫీసులో ఉండి పనులు చేయాలి. అంటే రెవెన్యూ శాఖకు సంబంధించిన సీసీఎల్ఏ కార్యాలయం నుంచే పని చేయాల్సి ఉంటుంది. కానీ, విజయవాడలో, బెంగళూరులో, ఈశాన్య రాష్ట్రాల నుంచి ధరణిని నిర్వహించారు. కేసీఆర్ మన దేశంలో లేని కంపెనీలకు, విదేశీయులకు ధరణిని అప్పగించి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు. దీనిపై ఆయనకు ఎంత కఠినమైన శిక్ష వేయాల్సిన అవసరం ఉందో ప్రజలు ఆలోచన చేయాలి” అని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. 

భూహక్కుల రక్షణకే భూభారతి.. 

రాష్ట్రంలోని భూ యజమానులందరి హక్కులు కాపాడేందుకు భూభారతి బిల్లు తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కానీ ప్రతిపక్ష పార్టీ అహంకారంతో చర్చను అడ్డుకోవాలని ప్రయత్నించిందని మండిపడ్డారు. సహనం కోల్పోయేలా రెచ్చగొట్టి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని ఫైర్ అయ్యారు. ‘‘పదుల సంఖ్యలో మీటింగ్​లు, వందల గంటల చర్చ తర్వాత భూ భారతి బిల్లును సభ ముందుకు తెచ్చాం. దీని నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐసీకి అప్పగించినం. కానీ, పాత సంస్థలు సహకరించడం లేదు” అని చెప్పారు. ‘‘

ఎక్కడైనా డే టైమ్​లో రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. కానీ బీఆర్ఎస్ హయాంలో అర్ధరాత్రి కూడా జరిగాయి. ఇలాంటి వ్యవస్థ ఏ రాష్ట్రంలోనైనా ఉందా?. వాళ్ల బండారం బయటపడుతుందనే భూభారతిపై చర్చ జరగకుండా బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేశారు” అని మండిపడ్డారు. ‘‘ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మారాయి. 

ఆనాడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫిర్యాదు చేసినా, లెక్క చేయకుండా తిమ్మాపూర్ భూదాన్ భూములను ప్రైవేటు వ్యక్తుల పేరున మార్చారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట తదితర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేశారు.  మా ప్రభుత్వం వచ్చాక, నేనే పలు చోట్ల కేసులు నమోదు చేయించాను” అని తెలిపారు. 

2010లోనే ఒడిశాలో ధరణి.. 

కేసీఆర్ చెప్పుకుంటున్నట్టు.. ధరణిని ఆయనేం కొత్తగా తీసుకురాలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ‘‘తన మెదడును రంగరించి ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకొస్తున్నామని ఆనాడు సభలో అప్పటి సీఎం కేసీఆర్ చెప్పారు. కానీ, 2010లోనే ఒడిశాలో ధరణిని తీసుకొచ్చారు. దాని నిర్వహణను ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీకి అక్కడి ప్రభుత్వం అప్పగించింది. అయితే అనుభవం, నైపుణ్యం లేని సంస్థకు -ధరణి పోర్టల్ అప్పగించారని ఒడిశా ప్రభుత్వాన్ని 2014లో కాగ్ తప్పుపట్టింది. కానీ కేసీఆర్ అదే ధరణిని మనపై రుద్ది, కాగ్ వద్దని చెప్పిన అదే సంస్థకు అప్పగించిండు.

 2018లో ఐఎల్అండ్ ఎఫ్ఎస్ తో పాటు గాదె శ్రీధర్ కు చెందిన ఈ సెంట్రిక్, విజెన్ ఇన్ఫోటెక్ సంయుక్తంగా ధరణి కాంట్రాక్టు దక్కించుకున్నాయి. నిజానికి 2017లోనే ఐఎల్​అండ్​ఎఫ్ఎస్​ దివాలా తీసి, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంది. కానీ సత్యం రామలింగరాజు, అతని కుమారుడితో ఉన్న బంధం (వీరికి చెందిన మెటాస్​ను ఐఎల్​అండ్​ఎఫ్ఎస్​ టేకోవర్ ​చేసింది) కారణంగా ఐఎల్అండ్ఎఫ్ఎస్ కు ధరణిని అప్పగించారు. క్రిమినల్ నేపథ్యం ఉన్న కంపెనీలను టెండర్లలో నిషేధించే విధానం ఉంది. కానీ కేసీఆర్ ఆ పని చేయలేదు. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి అన్ని రకాల బాధ్యతలు ఆ కంపెనీకి అప్పగించారు. 

ఆ తర్వాత ఐఎల్​అండ్ఎఫ్ఎస్ సబ్సిడరీ కంపెనీ అయిన టెరాసిస్ ధరణి కాంట్రాక్టును దక్కించుకున్నట్టు సభలో వివరించారు. ఈ టెరాసిస్ లో 99 శాతం షేర్లు ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్​ ఎస్​జీ అనే సంస్థ రెండు దఫాలుగా 2021 లో కొనుగోలు చేసింది. మిగిలిన ఒక్క శాతం వాటా మాత్రం కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు కొనుగోలు చేశారు. అయినా, ఆ ఒక్క శాతం షేరుతో శ్రీధర్ రాజు టెరాసిస్ కు సీఈవోగా మారారు. ఫాల్కన్ ఎస్జీ సంస్థలోని వందశాతం షేర్లు సింగపూర్ కు చెందిన ఫాల్కన్ ఇన్వెస్ట్​మెంట్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 

ఈ సింగపూర్ బేస్డ్ కంపెనీలో వందశాతం వాటాను ఐదు కంపెనీలు కొనుగోలు చేశాయి. మళ్లీ ఇందులో స్పారో ఇన్వెస్ట్ మెంట్స్ అనే సంస్థలో వందశాతం వాటాలు గేట్ వే ఫండ్ 2 అనే కంపెనీ చేతుల్లోకి వెళ్లాయి. ఆ కంపెనీ మూలాలు ఎక్కడ అన్నది గమనిస్తే.. పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన కేమాన్ దీవుల్లో ఉన్నట్టు తేలింది” అని వివరించారు. 

ఫార్ములా–ఈ రేస్ అక్రమాలు అట్ల బయటపడ్డయ్.. 

ఫార్ములా–ఈ రేసు ద్వారా హెచ్ఎండీఏకు చెందిన రూ.600 కోట్లను విదేశీ సంస్థలకు ఇచ్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందులోంచి రూ.55 కోట్లు చెల్లించిందని చెప్పారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా–ఈ రేసులో అక్రమాలు జరిగినట్టు గుర్తించాం. ఆ ఒప్పందాన్ని రద్దు చేశాం. దీంతో ప్రభుత్వం రూ.600 కోట్లు నష్టపోకుండా ఆపగలిగాం” అని వెల్లడించారు. ‘‘రూ.55 కోట్లు చిన్న అమౌంటా?. మన నిధులను ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఫారిన్ కంపెనీకి తరలించారు. 

దీనిపై విచారణ చేస్తుంటే, బీఆర్ఎస్ నేతలు రచ్చ చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం సహించం” అని హెచ్చరించారు. ‘‘ఫార్ములా–ఈ రేస్ నిర్వహణ సంస్థ ఎఫ్ఈవోకు చెందిన ప్రతినిధి అపాయింట్ మెంట్ అడిగితే నేనే ఇచ్చాను. ఆయన పైరవీ కోసం నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలోనే కేటీఆర్ తో చీకటి ఒప్పందం గురించి నాకు చెప్పారు. ఆ తర్వాతే నేను అన్ని విషయాలు అధికారులను అడిగి తెలుసుకున్నాను. ఇప్పుడు ఆ ఫొటో పట్టుకొని బీఆర్ఎస్ నేతలు ఏదో అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 వరకు జరిగిన అన్ని వివరాలను ప్రజలకు అందిస్తాం” అని తెలిపారు. 

‘‘ఫార్ములా–ఈ రేసుపై ఏడాదిగా చర్చ జరుగుతున్నా, ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా ఎప్పుడైనా దీని గురించి బీఆర్ఎస్ నేతలు  మాట్లాడారా?. నిన్నటి నుంచే దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏడాదిగా అవసరం లేని చర్చ.. ధరణి గురించి చర్చ వచ్చిప్పుడే ఎందుకు? కుట్రపూరిత ఆలోచనతోనే భూభారతి బిల్లుపై చర్చ జరగకూడదని ప్రయత్నించారు. ఫార్ములా–ఈ రేసుపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధం.. చివరకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులోనైనా సరే” అని సవాల్ విసిరారు. 

ఇంట్లో హరీశ్​కు కోదండం వేస్తరు.. 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు పరిస్థితి తమకు అర్థమవుతున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘కేటీఆర్ అరెస్టు అయితే, ఇక్కడ చొక్కాలు చించుకోకపోతే ఇంటి దగ్గర కొరడా దెబ్బలు ఉంటాయి. కోదండం కూడా వేస్తారు. ప్రజల కోసం కొన్ని కొరడా దెబ్బలు తినాలి.. మరీ మామకు అంత విశ్వాసం చూపాల్సిన అవసరం లేదు” అని హరీశ్ ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ‘‘ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి. వాళ్ల ఇంటి సమస్యలు ఏమున్నాయో తెలియదు. హరీశ్​రావు డిమాండ్ చేస్తేనే ఓఆర్ఆర్ పై విచారణకు ఆదేశించాం. దీనివల్ల ఏమైనా గొడవలు జరిగి ఉండొచ్చు” అని అన్నారు. 

స్పీకర్​కు అభినందనలు..

భూభారతి బిల్లుపై చర్చ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హుందాగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ సందర్భంగా స్పీకర్ కు అభినందనలు చెప్పారు. ‘‘సభ జరగకుండా బీఆర్ఎస్ నేతలు అనేక అవాంతరాలు సృష్టించారు.. ఆటవికంగా వ్యవహరించారు. అయినా ఎక్కడా డీవియేట్ కాలేదు. చర్చ జరగాలని సీపీఐ, ఎంఐఎం ప్రతినిధులు కోరినా బీఆర్ఎస్ నేతలు వినలేదు” అని అన్నారు. సభలో రూల్స్ అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని, దీనిపై  ఆలోచన చేయాలని స్పీకర్​ను కోరారు.  

ధరణి అద్భుమైతే కేసీఆర్​ చర్చకు ఎందుకు రాలే? 

మేం భూభారతి చట్టం తెస్తుంటే సభలో ప్రధాన ప్రతిపక్ష నేత లేరు. కనీసం దీనికైనా ఆయన రావాలి కదా!. ధరణి అద్భుతమైతే కేసీఆర్ సభలో ఉండి మమ్మల్ని నిలదీయాలి కదా!. 80 వేల పుస్తకాలు చదివిన జ్ఞానంతో సృష్టించిన ధరణి గురించి సభకు వచ్చి సంపూర్ణంగా వివరించవచ్చు కదా! భూభారతిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చ జరగకుండా తొండి చేయాలని బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు ప్రయత్నించి సభ నుంచి వెళ్లిపోయారు. 

బీఆర్ఎస్ నేతలకు గత డిసెంబర్ లో అధికారం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోయాయి. ఇప్పుడు మెదడు కూడా పోయింది. ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకున్నా, హెచ్ఎండీఏ ఖాతా నుంచి కోట్లు బదిలీ చేసినా ఏమీ అనొద్దన్నట్టుగా బీఆర్ఎస్ తీరు ఉంది. 

సీఎం రేవంత్ రెడ్డి