బయట మనిషి చచ్చిపోతే లోపల సిన్మా చూస్తవా.?అల్లు అర్జున్ ను నిలదీసిన సీఎం రేవంత్

  • ఆ తల్లి చచ్చిపోయినా కొడుకు చేతిని ఇడ్వలే.. విషయం చెప్పినా ఆ హీరో బయటకు రాలే 
  • పోలీసులు వార్నింగ్​ ఇచ్చాక రోడ్​ షో చేస్కుంటూ పోయిండు
  • మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాల్ని బలిపెడ్తామంటే సహించం
  • సినిమావాళ్లు, పొలిటికల్ ​లీడర్స్​ కోసం ప్రత్యేక చట్టాలు ఉండవ్​
  • ఒక్కరోజు హీరో జైలుకుపోతే కాళ్లు, చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లినట్టు క్యూ కట్టిన్రు 
  • చావుబతుకుల్లో ఉన్న శ్రీతేజ్​ దగ్గరకు ఒక్కరు కూడా పోలే
  • ఇలాంటి మానవత్వం లేని వాళ్ల కోసం మమ్మల్ని బద్నాం చేస్తారా?
  • ఇకపై బెనిఫిట్​ షోలకు, టికెట్​ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వం
  • శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి​ ఎమోషనల్​ స్పీచ్​

హైదరాబాద్, వెలుగు:సినిమావాళ్లు, రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక చట్టాలు ఉండవని, ప్రజలందరికీ ఒకే చట్టం వర్తిస్తుందని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాల్ని బలిపెడ్తామంటే ఊరుకునే ప్రసక్తి లేదని సినిమా ఇండస్ట్రీకి  స్ట్రాంగ్ ​వార్నింగ్​ఇచ్చారు. పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట,  రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనను  ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ  ప్రస్తావించగా, సభలోనే ఉన్న సీఎం రేవంత్​ వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ..‘బయట మహిళ చచ్చిపోతే నువ్వు లోపల సిన్మా చూస్తవా? తొక్కిసలాటలో ఆ తల్లి చచ్చిపోయినా పాపం కొడుకు చేతిని ఇడ్వలే. అక్కడి దృశ్యం ప్రతి ఒక్కరినీ కదిలించింది. కానీ ఇందుకు కారణమైన హీరో మాత్రం కరగలేదు.  పోలీసులు వెళ్లి లోపల సిన్మా చూస్తున్న హీరోకు విషయం చెప్పినా ఆయన బయటకు రాలేదు. కనీసం చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని కూడా పరామర్శించలేదు. ఒక్కరోజు హీరో జైలుకుపోతే కాళ్లు, చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లినట్లు సినిమావాళ్లంతా వెళ్లిన్రు. కానీ  చావుబతుకుల్లో ఉన్న శ్రీతేజ్​ దగ్గరకు ఎవ్వరూ పోలే’’ అని సీఎంఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఇలాంటి మానవత్వం లేని వాళ్ల కోసం మమ్మల్ని బద్నాం చేస్తారా?’’ అంటూ  బీఆర్ఎస్​ నేతలపై ఫైర్​అయ్యారు.  

ఆ హీరోకు అనుమతిలేదు

పుష్ప –2 సినిమా బెనిఫిట్​ షో సందర్భంగా అనుమతి లేకున్నా ఆర్టీసీ క్రాస్​ రోడ్స్​లో సంధ్య థియేటర్​కు ఆ హీరో  వచ్చారని, ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో  రేవతి అనే మహిళ మృతి చెందిందని సీఎం రేవంత్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుమారుడు శ్రీతేజ్​ బ్రెయిడ్​ డెడ్​ అయి.. హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.  ‘‘రూ.30 వేల నెల జీతం ఉన్న ఓ వ్యక్తి తన కుమారుడి కోసం రూ.12 వేలు పెట్టి మూడు వేల రూపాయల చొప్పున 4 టికెట్లు కొని థియేటర్ కు సినిమా చూసేందుకు వెళ్లాడు. తొక్కిసలాటలో   భార్యను కోల్పోయాడు. ఆయన కుమారుడు బ్రెయిన్ డెడ్ అయి వెంటిలేటర్ పై చికిత్స తీసుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. 

ఈ ఘటనపై చర్యలు తీసుకోవద్దా?’’ అని సీఎం ప్రశ్నించారు. ‘‘అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అక్కడి సీసీ టీవీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది.  థియేటర్​ లోపలికి వెళ్లేటప్పుడు ఆ తల్లి చిన్నారిని చేతులు పట్టుకుని తీసుకెళ్లింది.  చివరికి  ఆ తొక్కిసలాటలో  తాను చనిపోతున్నా.. బిడ్డకు ఏంకాకూడదని బాలుడి చెయ్యి పట్టుకుని వదల్లేదు. ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా సినిమా హీరో బయటకురాలేదు. బయటకు వచ్చిన తర్వాత మళ్లీ రూఫ్​టాప్‌‌పై చేతులు ఊపుతూ వెళ్లిపోయారు. కనీస మానవత్వం లేకుండా ఇంత బాధ్యతారహితంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారు’’ అని వివరించారు.

రోడ్డు షో లెక్క చేతులు ఊపుకుంటూ వచ్చిండు 

పుష్ప 2 సినిమా బందోబస్తు కోసం డిసెంబర్​ 2న చిక్కడపల్లి పీఎస్‌‌లో సంధ్య థియేటర్‌‌ యాజమాన్యం  దరఖాస్తు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఈ నెల 4న పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్‌‌, నిర్మాతతో సహా మరికొంత మంది సంధ్య థియేటర్‌‌కు వస్తున్నారని, బందోబస్తు కావాలని కోరారు. ఆ మరుసటి రోజే చిక్కడపల్లి సీఐ సంధ్య థియేటర్‌‌ యాజమాన్యానికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సంధ్య థియేటర్‌‌ పరిసరాల్లో రెస్టారెంట్లు, ఇతర థియేటర్లు ఉన్నాయని, థియేటర్‌‌కు ఎంట్రీ, ఎగ్జిట్ ఒక్కటే ఉందని, సెలబ్రిటీలు వస్తే ఫ్యాన్స్ ను అదుపు చేయడం కష్టం అవుతుందని, సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదని మూడో తేదీనే చెప్పారు. హీరో, హీరోయిన్‌‌, నిర్మాత ఎవరైనా థియేటర్‌‌కు రావడానికి అనుమతి లేదని పోలీసులు స్పష్టంచేశారు. ఈ మేరకు థియేటర్ పెట్టుకున్న దరఖాస్తును పోలీసులు తిరస్కరించారు.  పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా హీరో  థియేటర్‌‌ కు  రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వచ్చాడు. దీంతో హీరో ను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. అతడి ప్రైవేట్ సెక్యూరిటీ అయిన బౌన్సర్లు ఫ్యాన్స్ ను ఎలా పడితే అలా నెట్టేశారు. ఒకవైపు ఫ్యాన్స్​.. ఇంకోవైపు బౌన్సర్లు నెట్టుకునేసరికి  తొక్కిసలాట జరిగింది. హీరో థియేటర్ లోకి వెళ్లిన తర్వాత.. పైన బాల్కనీలో ఉన్న హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. కిందనుంచి జనాన్ని తొక్కుకుంటూ హీరో వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుందని పోలీసులు చెప్పినా థియేటర్ యాజమాన్యం పట్టించుకోలేదు. పోలీసులను అడ్డుకున్నారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోయింది. ఆమె బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడని తెలుసుకుని పోలీసులు హీరో దగ్గరకు వెళ్లి చెప్పారు. అయినా వినలేదు. మీపై కూడా చర్యలు తీసుంటామని చెప్పడంతో హీరో అక్కడి నుంచి వెళ్లిపోయారు. బయటకు వచ్చినప్పుడు కూడా.. అంటే ఓ మహిళ చనిపోయిందని తెలిసినా కూడా రూఫ్ టాప్ కారులో చేతులు ఊపుకుంటూ వెళ్లిపోయారు. ఇంత బాధ్యతారాహితంగా ఉన్న హీరోపై చర్యలు తీసుకోవాల్సిందేనని పోలీసులు కేసులు పెట్టారు’’  అని పేర్కొన్నారు.

ఇలాంటి జరగకుండా చూడాలి: అక్బరుద్దీన్​

అసెంబ్లీ వేదికగా పుష్ప 2 బెనిఫిట్​ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట, ఆ సినిమా హీరో  వ్యవహార శైలిని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ శనివారం అసెంబ్లీలో ప్రస్తావించారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందినా ఆ హీరో సినిమా చూసి వెళ్లారని విమర్శించారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పుష్ప 2 హీరో బాధ్యతారహితంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇవి పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.

ఇకపై బెనిఫిట్​షోలకు అనుమతివ్వం 

తాను సీఎంగా ఉన్నంత కాలం ఎలాంటి బెనిఫిట్​షో లకు, టికెట్​రేట్లపెంపునకు అనుమతి ఇవ్వబోనని రేవంత్​రెడ్డి తేల్చి చెప్పారు. ‘‘సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని ఎవరూ ఇవ్వని విధంగా మా ప్రభుత్వం రాయితీలను కల్పించింది. టికెట్​ ధరల పెంపునకు బెనిఫిట్​ షోలకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ప్రజల ప్రాణాలు పోతుంటే కూడా వాళ్లను ఏమీ  అనొద్దని అంటారేంటి?” అని ప్రశ్నించారు.  సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవాలని.. అంతే కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టం అందరికీ ఒక్కటే అనే విషయం గుర్తుంచుకోవాలని,  తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఒక రోజు జైలుకెళ్లిన హీరోను ఏదో కాళ్లు, చేతులు పోయిన వ్యక్తిలా పరామర్శించడానికి క్యూకట్టిన సెలబ్రిటీలు..ఓ మహిళ ప్రాణం పోయినా.. బాలుడు బ్రెయిన్ డెడ్ అయి కోమాలో ఉన్నా కనీసం పరామర్శించలేదని  ఫైర్​ అయ్యారు.

పోలీసులతోఅనుచితంగా ప్రవర్తించిండు 

సంధ్య థియేటర్​ ఘటనలో హీరో తప్పు ఉన్నట్లు తేలడంతో అతడిపై  పోలీసులు కేసుపెట్టారని సీఎం రేవంత్​చెప్పారు.  ఎఫ్ఐఆర్​లో  ఏ11గా ఉన్న  అతడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులతో ఆ హీరో అనుచితంగా ప్రవర్తించాడన్నారు.  ‘‘పుష్ప 2 సినిమా హీరో  అరెస్ట్‌‌ తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ప్రవర్తించాయి.  పలువురు నాయకులు నన్ను టార్గెట్​చేస్తూ మాట్లాడారు. సోషల్​ మీడియాలో నన్ను  నీచాతినీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టించారు.  పదేండ్లు మంత్రిగా పని చేసిన ఒకాయన, ఉద్యమాలు చేశామని చెప్పుకునే పార్టీవాళ్లు ట్విట్టర్​లో అడ్డగోలుగా పోస్టులు పెట్టారు.  సదరు హీరో భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారు.  ముఖ్యమంత్రిని తిట్టడానికి నీచమైన భాషను వాడారు.  ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్లను ఏం చేయొద్దా? ’’ అని  ప్రశ్నించారు. స్టార్స్​, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్‌‌కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? అని   ప్రశ్నించారు. ‘‘సినిమా వాళ్లు హత్యలు చేసినా విచారణ చేయొద్దా ? వాళ్ల కోసం ఏమైనా ప్రత్యేక చట్టం చేద్దామా?’’ అని  సీఎం రేవంత్​ రెడ్డి మండిపడ్డారు.