సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు.. క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దళిత క్రిస్టియన్లకు, దళితులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని క్రిస్మస్ వేడుకల సందర్భంగా తెలిపారు. హైద్రాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. క్రిస్టియన్ సంస్థలు, మిషనరీలు ప్రభుత్వంతో పాటు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నాయని కొనియాడారు. 

ప్రభు సందేశాన్ని నలు వైపులా పంచుతున్న మత పెద్దలకు, ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ నెల అంటే ఒక మిరాకిల్ మంత్ అని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన నెల డిసెంబర్ అని, అదే విధంగా సోనియమ్మ  పుట్టిన నెల కూడా ఇదే కావడం, ప్రపంచంలోనే అత్యధిక ప్రజలు జరుపుకునే పండగ క్రిస్మస్ ఈ నెలలోనే కావడం విశేషమని అన్నారు. నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగానే పొరుగువారిని ప్రేమించమని ప్రభువు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. 

ALSO READ | అసెంబ్లీలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు: కేటీఆర్
 
సర్వ మతాలను సమానంగా చూడటమే తమ ప్రభుత్వ సిద్ధాంతమని, వేరే మతాలను కించ పరుచడం లాంటి వాటిని తమ ప్రభుత్వం నిషేధించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం క్రిస్మస్ పండుగను అధికారికంగా రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నదని తెలిపారు. 

తెలంగాణ లో దళిత క్రిస్టియన్లకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 200 యూనిట్ల విద్యుత్, 500 గ్యాస్ అందిస్తున్నామని, సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. క్రిస్టియన్ లకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు.