రాజకీయ ప్రేరేపిత ఉచ్చులో పడొద్దు

  • ఉద్యోగులకు సీఎం రేవంత్​రెడ్డి సూచన
  • చర్చలతోనే సమస్యలకు పరిష్కారం 
  • ఎంప్లాయీస్​కు ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలిస్తున్నం
  • ప్రతినెలా అప్పులకే రూ. 6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది
  • సర్వశిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్​కు నో చాన్స్
  • అది కేంద్ర ​ప్రభుత్వ పరిధిలోని అంశమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: సమస్యల పరిష్కారానికి ధర్నాలే చేయాల్సిన అవసరం లేదని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  రాజకీయాల కోసం కొందరు నిరసనలు, ధర్నాలకు ప్రేరేపిస్తున్నారని, వారి ఉచ్చులో పడితే చివరకు నష్టపోయేది ఉద్యోగులేనని చెప్పారు. ఉద్యోగులను కష్టపెట్టి  నష్టం కలిగించే పనులు ప్రభుత్వం చేయబోదని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ​ఉద్యోగులను రెగ్యులరైజ్  చేయాలని తమకు ఉన్నా.. చేయలేని పరిస్థితి ఉన్నదని చెప్పారు.  సర్వశిక్ష అభియాన్ ​అనేది   కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అని, ఆ ఔట్​సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసే అవకాశం లేదన్నారు. 

నిబంధనలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేస్తే న్యాయస్థానాల్లో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. సెక్రటేరియెట్​లో టీజీవో ప్రెసిడెంట్​ ఏలూరి శ్రీనివాస్​రావు, జనరల్​ సెక్రటరీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్–2025 డైరీ, క్యాలెండర్ ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ప్రభుత్వానికి ఆదాయం లేకపోవడంతో కొన్నిసమస్యలను పరిష్కరించలేకపోతున్నామని చెప్పారు. ఉద్యోగుల సమస్యలు తమకు చెప్పాలని, వాటి పరిష్కారానికి 
కార్యాచరణ చేపడుతామని తెలిపారు. 

కనీసం 4 వేల కోట్లు కావాలి

ప్రతి నెలా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రూ.18,500 కోట్లు అని, ఇది ప్రభుత్వ అవసరాలకు సరిపోవడం లేదని సీఎం రేవంత్​ అన్నారు. అన్నీ సక్రమంగా నిర్వహించాలంటే  ప్రతినెలా రూ.30 వేల కోట్లు  అవసరమ ని తెలిపారు. వచ్చే ఆదాయంలో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర అవసరాలకు చెల్లిస్తున్నామని, మరో రూ.6,500 కోట్లు ప్రతి నెలా అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. మిగిలిన 5,500 కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. కనీస అవసరాలు తీరాలన్నా ఇంకో రూ.4 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. గత పదేండ్లలో పరిపాలనా వ్యవస్థను భ్రష్టు పట్టించారని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  ఆదాయాన్ని పెంచాలన్నా, పెంచిన ఆదాయం పంచాలన్నా ఉద్యోగుల చేతుల్లోనే ఉందని తెలిపారు. ప్రభుత్వంపై ఆధారపడి ప్రజల కోసం పనిచేసే వారికి ప్రతి నెలా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నామని అన్నారు.