- కృష్ణాలో 70 శాతం వాటా కోసం కొట్లాడండి
- వీసమెత్తు కూడా నష్టం జరగొద్దు.. ఏపీ నీళ్ల దోపిడీపై లెక్కలు తీయండి
- ట్రిబ్యునల్‌లో సమర్థంగా వాదనలు వినిపించాలని అధికారులకు దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు : కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనకు దక్కాల్సిందేనని.. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నది పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉండే ప్రాంతానికే ఎక్కువ వాటా దక్కాల్సి ఉంటుందని చెప్పారు. ‘‘కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలోనే 70 శాతం ఉంటుంది. ఏపీలో ఉండేది కేవలం 30 శాతమే. ఆ లెక్క ప్రకారం కృష్ణా నదిలో అందుబాటులో ఉండే 1,005 టీఎంసీల్లో మన రాష్ట్రానికే 70 శాతం దక్కాలి. అందుకు అనుగుణంగా ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌సెంటర్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఇరిగేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా, గోదావరి జలాలపై ఉన్న అంతర్రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కృష్ణా నది జలాల్లో 70 శాతం వాటా మనకే దక్కాలన్నారు. వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రిబ్యునల్ ముందు సమర్థంగా వాదనలు వినిపించాలని చెప్పారు. అందుకోసం అవసరమైన సాక్ష్యాలు, రికార్డులు, జీవోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పునర్విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని బ్రజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ చేపట్టాల్సి ఉంటుందని, ఇప్పటికే ట్రిబ్యునల్‌కు రాష్ట్రం తరఫున అభిప్రాయాలు, సాక్ష్యాలను సమర్పించామని, త్వరలోనే వాదనలు మొదలవుతాయని సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. ‘‘కృష్ణాకు సంబంధించి ఇప్పటివరకు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు, వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌లు, జలశక్తి శాఖకు ఇచ్చిన నివేదికలను సిద్ధంగా ఉంచుకోవాలి. వాటి ఆధారంగా ట్రిబ్యునల్ఎదుట గట్టిగా వాదనలు వినిపించాలి. 2014 నుంచి జారీ చేసిన జీవోలు, తీర్పులతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన జీవోలు, మెమోలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లు, అప్పటి నుంచి రాష్ట్రానికి జరిగిన నష్టంపై సమగ్ర నివేదిక తయారు చేయాలి” అని ఆదేశించారు.
Also Read :- మాలల సింహగర్జన... పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తి
ఏపీ దోపిడీని అడ్డుకుందాం..
కృష్ణా జలాల్లో వివిధ ప్రాజెక్టుల ద్వారా ఏపీ కోటాకు మించి నీటిని తరలించుకుపోతున్నదని సీఎం రేవంత్అన్నారు. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలీమెట్రీ విధానంతో ఏపీ జల దోపిడీకి అడ్డుకట్టు వేసేందుకు వీలుంటుందని, టెలీమెట్రీ పరికరాలకు రూ.12 కోట్లు ఖర్చవుతుందని, రెండు రాష్ట్రాలు సగం చొప్పున చెల్లించాల్సి ఉంటుందని సీఎంకు అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన ఆయన.. అవసరమైతే మొత్తం అమౌంట్ మనమే కట్టేద్దామని చెప్పారు. టెలీమెట్రీ పరికరాలను ఏర్పాటు చేశాక, ఏపీ నిధులు ఇస్తే రీయింబర్స్ చేసుకుందామని పేర్కొన్నారు. ముందు ఏపీ జలదోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కృష్ణా ప్రాజెక్టుల ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటున్నదో లెక్కలు తీయండి.
శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ, తెలుగు గంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు సహా వివిధ ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారో వివరాలు సిద్ధం చేయండి” అని ఆదేశించారు. సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బ్యారేజీకి అవసరమైన అనుమతులు తీసుకోవాలని.. పూర్తి ఆయకట్టుకు నీరందించేలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో తెలంగాణ తరఫున ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపిస్తున్న వైద్యనాథన్, ఏజీ సుదర్శన్‌రెడ్డి, అడిషనల్ ఏజీ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వ తరఫు అడ్వకేట్ ఖుష్ వోహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, మాణిక్ రాజ్, ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తదితరులు పాల్గొన్నారు.
బోర్డుల జోక్యం ఉండొద్దు..
పోలవరం నుంచి 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు తరలిస్తున్నదని, వాటికి బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ఆ జలాలను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వాడుకునేందుకు అవసరమైన ప్రణాళిక అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘కృష్ణా నది జలాల్లో వాటాలను బ్రజేశ్ కుమార్ట్రిబ్యునల్ ఇంకా తేల్చలేదు. అలాంటప్పుడు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)ల నిర్ణయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? నీటి వాటాల పంపిణీ పూర్తయ్యే దాకా కృష్ణా, గోదావరి బోర్డుల జోక్యం ఉండకూడదంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలి” అని అధికారులకు సూచించారు.