మోదీ మనమీద దండయాత్ర చేస్తున్నడు: రేవంత్రెడ్డి

పదేళ్ల బీఆర్ ఎస్ పాలనలో పాలమూరు నిర్లక్ష్యానికి గురైందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందన్నారు.పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయలే దన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 4వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సిద్ధమైందన్నారు. కొంత కాలంగా పెండింగ్ లో కృష్ణా, వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.

పాలమూరు  జిల్లా అభివృద్దిని అడ్డుకునేందుకు ఈ ప్రాంత నేతలు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇక్కడి నేతలు ఢిల్లీ సుల్తానులకు బానిసలై పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా, పాలమూరుకు రైలు రాకను అడ్డుకుంటున్నారని అన్నారు. పాలమూరు అభివృద్దికి కృషి చేస్తుంటే కొందరు ఇంటి దొంగలే కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు బొడ్డున కత్తి పెట్టుకుని తిరుగుతున్నారని అన్నారు. 

ప్రధాని మోదీ  మనమీద దండయాత్ర చేస్తున్నాడని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మోదీ లక్ష్యం రాజ్యాంగం మార్చడం, రిజర్వేషన్లు రద్దు చేయడమే..బీజేపీకి ఓటువేస్తే ..రిజర్వేషన్లను రద్దు చేయాలని తీర్పు ఇచ్చినట్లే బీజేపీ గెలిస్తే మతాల మధ్య చిచ్చు..మనుషుల మధ్య పంచాయతీ పెడ్తడు..బీజేపీ గెలిస్తే అభివృద్ది ఎక్కడికక్కడ ఆగిపోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉంది.. అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి..ఈ ప్రాంతానికి పరిశ్రమలు వస్తున్నాయి. మన ప్రాంతం అభివృద్ది చెందుతుంది..బీజేపీకి ఓటేస్తే పొద్దున లేస్తే పంచాయతీలే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది.. అక్కడ ఎటువంటి అభివృద్ది లేదన్నారు. ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.బీజేపీ ఉద్దండ నేతలు ఉత్తర ప్రదేశ్ నుంచి ఉన్నారు. మరి ఎందుకు పెట్టుబడులు రావడం లేదని ప్రశ్నించారు.

బీజేపీ పెట్టే పంచాయతీలు, ఆ పార్టీ చిమ్ముతున్న విషయంతో ఉత్తరప్రదేశ్ సర్వ నాశనం అయిందన్నారు రేవంత్ రెడ్డి . దేశరాజధానికి దగ్గరగా ఉన్న నోయిడాలో బీజేపీ పంచాయతీలతో అభివృద్ది లేదన్నారు. అదే పక్కన గురుగ్రామ్ కు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. 

ఇవాళ తెలంగాణకు కూడా మంచి అవకాశం ఉంది.. 2004 నుంచి 2014 మధ్య కాలంలో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వచ్చింది.. ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. మెట్రో రైలు వచ్చింది.. కృష్ణా గోదావరి నీళ్లు వచ్చాయన్నారు. వేల కోట్ల పెట్టుబడులు, లక్షలాది మందికి ఉపాధి లభించిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది.. ఇవాళ తెలంగాణకు కూడా మంచి అవకాశం ఉంది..ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులకు నీళ్లి్స్తామన్నారు.