రాళ్లు, రప్పలకు బంద్​ ఎవుసానికే భరోసా : సీఎం రేవంత్​రెడ్డి 

  • ఏటా ఎకరాకు రూ. 12 వేలు
  •  వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ కింద రూ.12 వేలు 
  • రేషన్​ కార్డులు లేనోళ్లకు కొత్త ​కార్డులు.. ఈ నెల 26 నుంచి మూడు స్కీమ్స్​ షురూ
  • కేబినెట్​ భేటీ అనంతరం సీఎం రేవంత్ ప్రకటన
  • గత సర్కార్​లో గుట్టలు, వెంచర్లకు రైతుబంధు 
  • ఆ అక్రమాల జోలికెళ్తే కేసీఆర్​ ఫ్యామిలీకి వెయ్యేండ్ల జైలు శిక్ష ఖాయం
  • నిజమైన రైతులకు మేలు జరగాలన్నదే తమ ప్రభుత్వ విధానమని వెల్లడి
  • మున్సిపాలిటీగా ములుగు జీపీ.. కార్పొరేషన్​గా కొత్తగూడెం మున్సిపాలిటీ
  • పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్​ రెడ్డి, సింగూరు ప్రాజెక్టు కెనాల్​కు రాజనర్సింహ పేరు
  • పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలు
  • నార్లాపూర్​ పనుల రివైజ్డ్​ ఎస్టిమేట్స్​కు ఆమోదం.. పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్​ డ్యామ్​ నిర్మాణం

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందజేస్తామని.. ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇస్తామని సీఎం రేవంత్​రెడ్డి ప్రకటించారు. రాళ్లు, రప్పలు, గుట్టలు, వెంచర్లకు రైతు భరోసా ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏటా రూ.12 వేలు సాయం చేస్తామని, ఈ స్కీమ్​కు  ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. రేషన్​కార్డులు లేనివాళ్లకు కొత్త రేషన్​ కార్డులు కూడా ఇస్తామన్నారు. ఈ మూడు స్కీమ్​లను జనవరి 26 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా ఈ తేదీకి చాలా ప్రాధాన్యం ఉందని, అందుకే మూడు స్కీమ్​లను ఆరోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

సీఎం రేవంత్​రెడ్డి అధ్యక్షతన శనివారం సెక్రటేరియెట్​లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో  22  అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పంచాయతీరాజ్ – గ్రామీణాభివృద్ధి శాఖలో 588 కారుణ్య నియామకాలకు, ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చుతూ ఆమోదముద్ర వేశారు. రైతుభరోసాపై కేబినెట్​ సబ్​ కమిటీ ఇచ్చిన రిపోర్ట్​పై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కేబినెట్​ భేటీ వివరాలను మీడియాకు సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులను బట్టి రైతు భరోసా కింద ఎకరాకు ఏటా  రూ.12 వేలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. గత ప్రభుత్వం రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తే.. ఇప్పుడు రైతు భరోసా కింద తమ ప్రభుత్వం ఎకరాకు రూ. 12 వేల చొప్పున ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం.. పేదలకు పెంచడమే తమ ప్రభుత్వ విధానమన్నారు.  ఎంత వెసులుబాటు ఉంటే అంత ఇవ్వాలన్నది తమ ఆలోచన అని చెప్పారు. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకానికి  ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఎలా చేయాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు.

రాళ్లు రప్పలకు ఇచ్చేది లేదు

వ్యవసాయయోగ్యం కాని భూములకు కూడా గతంలో రైతుబంధు నిధులు చేరాయని, ఇకపై అలా ఉండదని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కూడా నూతన సంవత్సరంలో మంచి జరగాలి. వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేయాలనే ఉద్దేశంతో రైతులకు శుభవార్త వినిపించాలని రైతు భరోసాపై నిర్ణయం తీసుకున్నం. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇస్తం. వ్యవసాయ యోగ్యం కాని భూములు అంటే రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లల్లో పోయిన భూములు, మైనింగ్​ చేస్తున్న భూములు

నాలా కన్వర్షన్ అయినవి, రియల్​ ఎస్టేట్​ వెంచర్లు వేసిన భూములకు, పరిశ్రమలకు తీసుకున్న భూములకు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతుభరోసా ఇవ్వం. ఇందుకోసం మా రెవెన్యూ అధికారులు.. గ్రామాలవారీగా సాగుయోగ్యం కాని భూముల సమాచారం సేకరించి, గ్రామ సభలతో ప్రజలకు వివరిస్తారు. రెవెన్యూ రికార్డులు, ధరణిలో ఉన్న లోపాలతో వ్యవసాయయోగ్యం కాని భూములకు సైతం గతంలో రైతుబంధు నిధులు చేరాయి. ఇకపై అలా ఉండదు. అలాంటివారెవరైనా ఉంటే మీరే ముందుకు వచ్చి ప్రభుత్వానికి వివరాలు అందించడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నం”

అని ఆయన అన్నారు. గతంలో ఏం జరిగిందో వెనక్కి వెళ్తే కేసీఆర్​ కుటుంబం వెయ్యి సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తదని, కాబట్టి భవిష్యత్​లో తప్పు జరగకుండా.. నిజమైన రైతులకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానమని సీఎం చెప్పారు. ఇది మంత్రివర్గం తీసుకున్న ఒక మంచి నిర్ణయమని, అనవసరమైన అంశాలు, వివాదాలకు తావు లేకుండా వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా వస్తుందని వెల్లడించారు. 

పాలమూరు ప్రాజెక్టుకు జైపాల్​రెడ్డి పేరు..సింగూరు ప్రాజెక్టుకు రాజనర్సింహ పేరు

సన్న బియ్యం పంపిణీ, కొత్త మండలాల ఏర్పాటుపై కూడా కేబినెట్​ భేటీలో చర్చ జరిగింది. త్వరలోనే వీటిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.  ఇందిరమ్మ ఇండ్లు,  సమగ్ర కుల గణన సర్వే, బీసీ రిజర్వేషన్లపైనా కేబినెట్​ సమావేశంలో చర్చించినా వివరాలు బయటకు వెల్లడించలేదు. కాగా, పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి జైపాల్​ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్​ నిర్ణయించింది. సింగూరు ప్రాజెక్టు కెనాల్​కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి రాజనర్సింహ పేరు పెట్టేందుకు ఆమోదం తెలిపింది.

వ్యవసాయ కూలీలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’

‘‘వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు ఏడాదికి రూ.12 వేలు రైతుభరోసా ఇస్తం. భూమి లేని వ్యవసాయ కూలీలకు ఏమీ రావడం లేదు. వారికి భూమి లేకపోవడం ఒక శాపం..  ప్రభుత్వం ఆదుకోకపోవడం మరో శాపం అన్నట్లుగా మారింది.  గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవసాయ కూలీల ఆవేదనను విన్నం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం కాబట్టి భూములు లేని వ్యవసాయ రైతు కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించినం.

ALSO READ : పెట్టుబడులు పెట్టి అభివృద్ధిలో భాగంకండి : రేవంత్ రెడ్డి

వారికి ఏటా  రూ.12 వేలు ఇస్తం. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని నామకరణం చేసినం” అని  సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే చాలా ఏండ్లుగా పేదలను రేషన్​ కార్డుల సమస్య పట్టి పీడిస్తున్నదని.. రేషన్​ కార్డు లేనివాళ్లకు  కొత్త రేషన్​ కార్డులు ఇవ్వాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

కేబినెట్​ ఆమోదించిన పలు నిర్ణయాలు

  • పాలమూరు ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజీ 2లోని నార్లాపూర్​ రిజర్వాయర్​ పనుల రివైజ్డ్​ ఎస్టిమేట్స్​కు కేబినెట్​ ఆమోదం తెలిపింది. తొలుత రిజర్వాయర్​కు రూ.800 కోట్లతో అంచనాలను రూపొందించినా ఆ తర్వాత రూ.1,400 కోట్లకు పెంచారు. తాజాగా రూ.1,784 కోట్ల  రివైజ్డ్​ ఎస్టిమేట్స్​కు కేబినెట్ఆమోదం తెలిపింది. 
  • ఏదుల రిజర్వాయర్​ నుంచి డిండి ఎత్తిపోతలకు మధ్యలో పోతిరెడ్డిపల్లి వద్ద రబ్బర్​ డ్యామ్​ను నిర్మించే ప్రతిపాదనకూ కేబినెట్​ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈ ప్రాజెక్టును రూ.1,800 కోట్లతో నిర్మించనున్నారు. ఇందులో భాగంగా 16 కిలోమీటర్ల మేర టన్నెల్​ తవ్వి గ్రావిటీ ద్వారా డిండికి నీటిని తరలించనున్నారు.
  • జూరాల ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో మరింత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించేందుకు టెక్నికల్ ఎక్స్​పర్ట్​ కమిటీని నియమించాలని కేబినెట్​ నిర్ణయించింది. ఇప్పుడున్న ప్రాజెక్టులకు మరింత నీటిని తీసుకునే సాధ్యాసాధ్యాలపై కమిటీ అధ్యయనం చేయనుంది.
  • మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్ తాగునీటికి తరలించే ‘గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై’ స్కీమ్ ఫేజ్-2, ఫేజ్-3కి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో 15 టీఎంసీలకు ప్రతిపాదించిన ఈ పథకాన్ని భవిష్యత్ అవసరాల దృష్ట్యా 20 టీఎంసీలకు పెంచేందుకు  ఆమోదం తెలిపింది. 
  • కొత్తగూడెం మున్సిపాలిటీని మున్సిపల్​ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఓకే చెప్పింది.