చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు.. నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు..

హైదరాబాద్: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన ఇన్ని రోజుల తర్వాత టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. కొందరు సినీ ప్రముఖులు కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దని టాలీవుడ్ నిర్మాత శ్యాంప్రసాద్‌ రెడ్డి అన్నట్లుగా తెలిసింది.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అందరు సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని,  ఈ ప్రభుత్వం కూడా తమను బాగా చూసుకుంటోందని చెప్పారు. దిల్‌ రాజును FDC చైర్మన్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నానని సీఎంతో అన్నారు. 

తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్‌ స్పాట్‌లు ఉన్నాయని,  గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ హైదరాబాద్‌లో నిర్వహించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరుతున్నామని - రాఘవేంద్రరావు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఇక సినీ నటుడు, నిర్మాత నాగార్జున మాట్లాడుతూ.. యూనివర్సల్‌ లెవెల్‌లో స్టూడియో సెటప్‌ ఉండాలని, ప్రభుత్వం కేపిటల్ ఇన్సెంటివ్‌లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని నాగార్జున అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని - నాగార్జున చెప్పుకొచ్చారు.