సావిత్రీభాయి పూలే చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి

సావిత్రిభాయి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు సీఎం రేవంత్ రెడ్డి.  రేవంత్ తో పాటు ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి పలువురు ఉన్నారు. 

సావిత్రిబాయి పూలే ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. పూలే దంపతుల సేవలను, త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘భారత సమాజంలో చారిత్రాత్మకమైన మార్పు కోసం సావిత్రి బాయి ఫూలే పునాది వేశారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించారు. అణచివేతలకు గురైనవారికి న్యాయం అందించేందుకు తమ జీవితాన్ని అర్పించారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం” అని పేర్కొన్నారు.

సావిత్రిబాయి పూలే జయంతిని ఇక నుంచి ‘మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం’గా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.  ఈ మేరకు జనవరి 2న  సీఎస్​ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా ఈ పండుగను ‘స్టేట్ ఫంక్షన్​’ గా జరపాలని కలెక్టర్లను సీఎస్  ఆదేశించారు  ‘ఉమెన్​ టీచర్స్​ డే’ ఉత్సవంలో భాగంగా ప్రతి స్కూల్​లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని, మహిళా టీచర్లను సన్మానించాలని ఎంఈవోలకు  డైరెక్టరేట్​ ఆఫ్​ స్కూల్​ ఎడ్యుకేషన్​ సూచించింది. సావిత్రిబాయి పూలే సేవలను విద్యార్థులకు తెలియజేయాలని పేర్కొంది.