పాలమూరు ప్యాకేజీ 3 పనులు స్పీడప్ : సీఎం రేవంత్​రెడ్డి

  • వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం 
  • పాత కాంట్రాక్టర్​తోనేకాల్వను తవ్వించండి 
  • పుట్టంగండి సిస్టర్న్​కు రిపేర్లు చేయించాలని నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టులోని ప్యాకేజీ 3 పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని తన ఇంట్లో ఇరిగేషన్​అధికారులతో ప్రాజెక్టుపై ఆయన రివ్యూ నిర్వహించారు.

ప్యాకేజీ 3లో భాగంగా నార్లాపూర్ ​రిజర్వాయర్​ నుంచి ఏదుల రిజర్వాయర్ ​వరకు చేపట్టిన ప్రధాన కాల్వ తవ్వకం బండరాయి అడ్డుపడడం వల్ల ఆగిపోయింది. 8.32 కిలోమీటర్ల కాల్వలో 4.3 కిలోమీటర్ల మేర తవ్వడం పూర్తయింది. తొలుత ఈ ప్యాకేజీ కోసం రూ.416 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు రూపొందించగా, బండరాయి అడ్డుపడడంతో అంచనాలను రూ.784 కోట్లకు పెంచారు.

ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన కేబినెట్​మీటింగ్​లో దానికి ఆమోద ముద్ర పడలేదు. దీంతో తాజాగా సీఎం రేవంత్​రెడ్డి దానిపై రివ్యూ చేశారు. పాత రేట్ల ప్రకారం పాత కాంట్రాక్టర్​తోనే పనులు పూర్తి చేయించేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై కాంట్రాక్టర్​తో చర్చలు జరపాలని సంబంధిత సీఈకి సూచించారు. వాస్తవానికి టెండర్​రద్దు చేయాలని భావించినా, ఖర్చు పెరిగే అవకాశం ఉండడంతో పాత కాంట్రాక్టర్​తోనే పాత రేట్ల ప్రకారం పనులు చేయించాలని సర్కార్ భావిస్తున్నట్టు తెలిసింది. 

పుట్టంగండి సిస్టర్న్​కరాబ్.. ​

హైదరాబాద్ కు తాగునీటిని సరఫరా చేసే పుట్టంగండి సిస్టర్న్​కు రిపేర్లు చేయించాలని సర్కార్ నిర్ణయించింది. సిస్టర్న్​కు డ్యామేజీ అయి రిజర్వాయర్, కెనాల్ తెగే పరిస్థితి ఏర్పడింది. దీంతో దానికి రిపేర్లు చేయించాలని అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. అయితే రిపేర్లకు 3 నెలల సమయం పడుతుందని, దాని వల్ల హైదరాబాద్ కు నీటి సరఫరా ఆపాల్సి వస్తుందని అధికారులు వివరించగా.. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సమాంతరంగా ఆల్టర్నేట్​పైప్​లైన్​వేసి, నీటిని తరలిస్తే ఎంత ఖర్చవుతుందో అంచనాలు తయారు చేయాలని సీఎం సూచించినట్టు తెలిసింది.

పంప్​హౌస్​లో ఇప్పటికే 4 పంపులు ఉండగా, ఇంకో పంపునూ పెట్టుకునేందుకు అవకాశం ఉందని అధికారులు చెప్పినట్టు సమాచారం. దానితో రోజూ 650 క్యూసెక్కులను తీసుకెళ్లేందుకు అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రిజర్వాయర్​ను ఖాళీ చేసి చూస్తే లోపాలు తెలుస్తాయని అంటున్నారు. దాని ప్రకారం రిపేర్లకు వెళ్తే రూ.10 కోట్లలోపే అవుతాయంటున్నారు. కానీ కెనాల్స్​కు లైనింగ్​చేయిస్తే మాత్రం రూ.470 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.