అభివృద్ధి పథంలో సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి

రేవంత్‌రెడ్డి  సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో గత 10 నెలల నుంచి ‘అభివృద్ధి కళ’ ఉట్టిపడుతోంది.  రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో  అధికారిక  కార్యక్రమాల్లో  తీరిక లేకుండా ఉండటంతో  గత 10 నెలల నుంచి సొంత గ్రామానికి  రాలేకపోయారు.  నేడు దసరా రోజు  రేవంత్‌రెడ్డి  తీరిక  చేసుకుని  కొండారెడ్డిపల్లి వస్తున్నారు. దాంతో ఊళ్లో ‘పండుగ’ వాతావరణం నెలకొంది.  రేవంత్‌రెడ్డి వస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉందని గ్రామస్తులు  కడారి రావ­లు,  కడారి శ్రీరావ­లు,  ఏనుగు సంజీవరెడ్డి,  జంగయ్య యాదవ్‌,  చిట్టెమ్మ,  కిష్టయ్య తదితరులు చెప్పారు. 

గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి అభివృద్ధికి నోచుకోని కొండారెడ్డిపల్లి గ్రామం గత పది నెలల నుంచి అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ జనాభా సుమారు 4000 వరకు ఉంటుంది. హైదరాబాద్‌– -శ్రీశైలం హైవేలో.. హైదరాబాద్‌ నుంచి 85 కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లి  క్రాస్‌రోడ్డు ఉంటుంది.  ఈ క్రాస్‌ రోడ్డు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో కొండారెడ్డిపల్లి ఉంది.  సీఎం రేవంత్‌రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండటంతో గ్రామంలో అభివృద్ధి పనుల బాధ్యతను కొంతమంది మిత్రులకు అప్పచెప్పారు. 

గ్రంథాలయానికి అమర జవాన్ యాదయ్య పేరు దసరా పండుగ రోజు  సొంతగ్రామ  ప్రజలతో గడిపేందుకు రేవంత్‌రెడ్డి ఇయ్యాల గ్రామానికి వస్తున్నారు. గ్రామంలో జరిగే  దసరా వేడుకల్లో ‘జమ్మిచెట్టు’ పూజ తదితర కార్యక్రమాల్లో ఆయనపాల్గొంటున్నారు.  సుమారు రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ కమ్యూనిటీ  భవనాన్ని రేవంత్‌రెడ్డి  ప్రారంభిస్తున్నారు. మరో 20 లక్షల రూపాయలతో  నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు.

కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎం. యాదయ్య అనే జవాన్‌ జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు అర్పించారు. అందుకే యాదయ్య పేరును గ్రంథాలయానికి ‘అమర్‌ జవాన్‌ ఎం. యాదయ్య స్మారక గ్రంథాలయం’ పేరు పెట్టారు. రేవంత్‌రెడ్డి సూచన మేరకే యాదయ్య పేరు గ్రంథాలయానికి పెట్టడమే కాకుండా యాదయ్య కుటుంబానికి రేవంత్‌రెడ్డి సాయం అందించి ఆదుకున్నారు.

ఈ గ్రామంలో పాడి పశువుల పెంపకం బాగా ఉండటంతో  పశువులు ఆరోగ్యం కోసం  ‘ప్రాథమిక పశువైద్య కేంద్రం’ భవనం నిర్మించారు.  గ్రామానికి గుండెకాయలాంటి గ్రామ పంచాయతీ కోసం 25 లక్షల రూపాయల ఖర్చుతో  పంచాయతీ భవనం నిర్మించారు.  గ్రామ పంచాయతీ భవనాన్ని ఆధునికంగా తీర్చిదిద్దారు.

ఆధునిక హంగులతో రైతు వేదిక

రైతుల కోసం నిర్మించిన ‘రైతు వేదిక’కు  ఆధునిక హంగులు సమకూర్చారు.  ఇక్కడ కంప్యూటర్లు ఏర్పాటు చేశారు.  రైతు కుటుంబాలు,  మహిళలకు  స్వయం ఉపాధి పనుల కోసం కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఆధునికీకరించిన  రైతు వేదికను  కూడా  సీఎం రేవంత్‌రెడ్డి  ప్రారంభించనున్నారు.  మొత్తం అయిదు భవనాలను గ్రామ ప్రజలకు రేవంత్‌రెడ్డి అంకితం ఇస్తున్నారు.  అభివృద్ధిక్రమంలో  భాగంగా గ్రామంలో అన్ని రోడ్లను సిమెంట్‌, కాంక్రీట్‌ (సీసీ) రోడ్లుగా మార్చారు.  అండర్‌గ్రౌండ్‌  డ్రైనేజీ  చేపట్టాలని నిర్ణయించారు.  రూ.90 లక్షలతో సమీకృత ఆరోగ్య కేంద్రం భవనం నిర్మించాలని ప్రతిపాదించారు.

జిల్లా పరిషత్‌  పాఠశాలకు ప్రహరీ గోడను నిర్మిస్తున్నారు. కొండారెడ్డిపల్లి క్రాస్‌ రోడ్డు నుంచి కొండారెడ్డిపల్లి  గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న రోడ్డును ‘ఫోర్‌ వే’ రోడ్డుగా  విస్తరిస్తూ నిర్మాణం కార్యక్రమం యుద్ధప్రాతిపదికన  చేస్తున్నారు. హైదరాబాద్‌-– శ్రీశైలం హైవేపై  డిండి ప్రాజెక్టు సమీపంలో ఉన్న కిష్టంపల్లి గేట్‌ నుంచి కొండారెడ్డిపల్లి,  తిమ్మరాస్‌పల్లి గ్రామాల మీదుగా ఎల్లికల్‌ క్రాస్‌రోడ్డు (కల్వకుర్తి సమీప గ్రామం) వరకు 19 కిలోమీటర్ల రోడ్డును అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాగే కొండారెడ్డిపల్లి నుంచి జంగారెడ్డిపల్లి వరకు 3 కిలోమీటర్ల రోడ్డును కూడా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉందని సమాచారం. 

సోలార్‌ విద్యుత్‌కు ఆదర్శగ్రామం

కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రస్తుతం రోజూ దాదాపు 20 వేల లీటర్ల పాలను సేకరించే  ‘విజయ డెయిరీ’ ఉంది. ఈ కేంద్రాన్ని కూడా ఆధునీకరిస్తున్నారు.  గ్రామంలో చాలా కాలం క్రితం కట్టిన హనుమాన్‌ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దాదాపు రెండున్నర కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరణ  పనులు జరుగుతున్నాయి. స్తంభాలు, గోడలు, రూఫ్‌కు సంబంధించిన శిలలను గుంటూరు జిల్లా మార్టూరు నుంచి తెప్పిస్తున్నారు. హనుమాన్‌ విగ్రహంతో పాటు శివలింగాన్ని  తిరుపతి  నుంచి  తెప్పిస్తున్నారు.

ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి­. మరో ఆరు నెలల సమయంలో నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  కాగా,  కొండారెడ్లిపల్లిని సోలార్‌ విద్యుత్‌ సరఫరాలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిపై సోలార్‌ ప్యానెళ్లను అమరుస్తున్నారు.  ఇందుకోసం ఒక ప్రైవేట్‌ సంస్థ సహకారం అందిస్తోంది. ఇప్పటికే  దాదాపు 50 ఇండ్లపై సోలార్‌ ప్యానెళ్లను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా అన్ని ఇండ్లకు సోలార్‌ పవర్‌  సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.  సాధారణ విద్యుత్‌  సరఫరాపై ఆధారపడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే ఇండ్లల్లో ఉత్పత్తి అయ్యే సోలార్‌ పవర్‌ను జెన్‌కోకు విక్రయిస్తారు. 

గ్రామమే రేవంత్​ ఊపిరిఎనుముల రేవంత్‌రెడ్డి పుట్టి పెరిగిన గ్రామం కొండారెడ్డిపల్లి కావడంతో ఈ గ్రామంతో ఆయనకు అత్యంత అనుబంధం ఉంది. ఒకటో తరగతి నుంచి అయిదో తరగతి వరకు కొండారెడ్డిపల్లిలో చదువుకున్నాడని ఆయన సీనియర్‌ విద్యార్థి ప్రస్తుతం ఇదే గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్న విజయకుమార్‌ రెడ్డి చెప్పారు. 6,7 తరగతులు తండ్రా (కొండారెడ్డిపల్లి సమీప గ్రామం) గ్రామంలో చదువుకున్నాడు. 8 నుంచి10వ తరగతి వరకు వనపర్తిలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్​లో  చదువు కొనసాగింది.

అనంతరం  వ్యాపారంలోనూ,  రాజకీయాల్లోనూ కొనసాగుతున్నారు.  రేవంత్‌రెడ్డిది  పెద్ద కుటుంబం.  ఎనుముల నర్సింహారెడ్డి  రేవంత్‌రెడ్డి తండ్రి.  నర్సింహారెడ్డికి ఏడుగురు కొడుకులు, ఒక కూతురు.    రేవంత్‌రెడ్డి  కుటుంబానికి కొండారెడ్డిపల్లిలో  ఒక ఇల్లు ఉంది.  ఆయన వదిన ఈ ఇంట్లో ఉంటుంది.  గ్రామంలో వీరికి వ్యవసాయ భూములున్నాయి. వరి తదితర పంటలు వేస్తుంటారు. 

చిన్న పరిశ్రమలు

కొండారెడ్డిపల్లి  గ్రామ ప్రజలు  ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు.  గ్రామం సమీపంలో  ‘ఓంకారేశ్వర’ పేరుతో  గ్రౌండ్‌నట్‌ మిల్‌ ఉంది.  ‘వేంకటేశ్వర’  పేరుతో కాటన్‌ మిల్లు ఉంది. ఒక పారాబాయిల్డ్‌ రెస్‌మిల్లు ఉంది.  ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో  కొండారెడ్డిపల్లి  గ్రామస్తులకు ఉపాధి లభిస్తోంది.

మాకు దేవుడు  ‘రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా అదృష్టం’ అని కొండారెడ్డిపల్లి గ్రామస్తులు పేర్కొన్నారు.  రేవంత్‌  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గ్రామంలో అభివృద్ధి పనులు ప్రారంభమై వేగంగా సాగుతున్నాయని వారు తెలిపారు. అందుకే రేవంత్‌  ‘మా పాలిట దేవుడే’ అని చాలామంది అభిప్రాయపడ్డారు.

పీవీ రమణారావు,
సీనియర్‌ జర్నలిస్టు