రైతన్నల బంధువు రేవంతన్న

‘మాది గ్రామీణ ప్రాంతం.. నేను రైతు బిడ్డను.. వ్యవసాయం మా సంస్కృతి. రైతులకు వ్యవసాయంలో ఎన్నో కష్టనష్టాలున్నాయి. రైతులు పండించే పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ లాభాలు రావాలనేది నా కల. అందుకే వ్యవసాయంలో లాభాలు వచ్చే విధానాలు అవలంబించాలి. రైతులు నిరంతరం ప్రపంచానికి తన వంతు సాయం చేస్తూనే ఉన్నారు. ప్రపంచం కూడా రైతులకు సాయం చేసేందుకు అడుగులేయాలి.. ’ ఏడు నెలల కిందట జనవరి 17వ తేదీన  దావోస్​లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలివి. 

‘నా జీవితంలో ఇది మరిచిపోలేని రోజు.. అన్నం పెట్టే రైతును అప్పుల 

ఊబి నుంచి ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే బృహత్తర సాహసం.. ఇది రైతు రుణమాఫీ పథకం.. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలనేది నా కోరిక. అందుకే ఇది తెలంగాణ చరిత్రలో రైతు సంక్షేమ అధ్యాయంగా నిలిచిపోతుంది..’ అని రేవంత్ రెడ్డి స్వయంగా తన ఆనందాన్ని అధికారులు, పార్టీ నేతలతో పంచుకున్నారు. 

సరిగ్గా ఏడు నెలలకు.. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను ఆదుకునే నిర్ణయం

తీసుకున్నారు. రైతు బాంధవుడినని చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాక ముందే 2022 మే 6వ తేదీన రైతుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా వరంగల్ డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్​లో  జరిగిన భారీ బహిరంగ సభలో స్వయంగా ఈ డిక్లరేషన్​ను ప్రకటించారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారు.  ఇటీవల జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ వేడుకలు జరిగాయి. అదే వేదికపై మాది రైతు ప్రభుత్వమని, ఆగస్టు 15వ తేదీలోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మరోమారు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాటకు నెల రోజుల ముందే.. జులై 15న రాష్ట్ర వ్యవసాయ శాఖ రైతు రుణ మాఫీ పథకం విధి విధానాలపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 

సత్వర సాయం 

గత పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2020 మార్చి 17న లక్ష రూపాయల రైతు రుణమాఫీకి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ.. మూడేండ్ల పాటు 2023 దాకా రైతుల ఖాతాలో రుణ మాఫీ నిధులు జమ చేయనే లేదు. కానీ.. రేవంత్ రెడ్డి రుణమాఫీ విధి విధానాలు జారీ చేయటంతోనే తన బాధ్యత అయిపోయింది అన్నట్లుగా.. ఆగిపోలేదు. రైతులకు సత్వర సాయం అందించే  సంకల్పంతో అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించారు. లక్ష రూపాయల లోపు రుణాలున్న  రైతులందరి ఖాతాల్లో జులై 18 నాడే రుణమాఫీ నిధులు జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని నిధులను ఆర్థిక శాఖ వ్యవసాయ శాఖకు బదిలీ చేసే ఫైలుపై సంతకం చేశారు.   

కాదన్నవాళ్ల నోళ్లు మూతపడ్డాయి

అంత భారీ మొత్తంలో నిధులు ఎలా తెస్తారు.. అసలు ఈ రుణమాఫీ సాధ్యమయ్యే పనే కాదు.. రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తే ఏకంగా తమ పదవులకు సైతం రాజీనామాలు చేస్తామంటూ.. గడిచిన పదేండ్లు రైతులను మోసం చేసిన పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి సీఎంగా చేపట్టిన తొలి ఆరు నెలల్లోనే నానా యాగీ చేశారు. ఈ సవాళ్లన్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి తన చిత్తశుద్ధి.. నిబద్ధతతోనే అధిగమించగలిగారు. పట్టువదలని విక్రమార్కుడిగా వరుసగా అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై నిధుల సమీకరణకు అవసరమైన ప్రత్యామ్నాయాలన్నింటినీ స్వయంగా సమీక్షించారు. అనుకున్న ప్రణాళిక ప్రకారం తన కార్యాచరణను అమలు చేసి చూపించి.. అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను సైతం ఆశ్చర్యపరిచారు.  తెలంగాణ రైతన్నల గుండెల్లో.. ‘రైతు బాంధవుడు రేవంతన్న’ అని ఇప్పటికీ ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. 

రైతులను నిండా ముంచిన గత ప్రభుత్వం​

 ​2023లో ఎన్నికలు ముంచుకురావటంతో రైతుల ఓట్లు గుర్తుకు వచ్చినట్లుగా.. హడావుడిగా పథకం ప్రారంభించింది. లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం కేవలం రూ. 99,999 వరకు రుణాలున్న రైతుల ఖాతాలకే నిధులు విడుదల చేసింది. ఒక్క రూపాయితో నష్టమేముంది అనిపించవచ్చు. కానీ.. ఆ ఒక్క రూపాయి తేడాతో రాష్ట్రంలోని 12 లక్షల మంది రైతులను అప్పటి ప్రభుత్వం నిట్టనిలువునా మోసం చేసింది. వీరందరూ రుణమాఫీకి నోచుకోలేకపోయారు. వీరికి చెల్లించాల్సిన దాదాపు రూ.8579 కోట్లు అప్పటి ప్రభుత్వం ఎగ్గొట్టింది. 

రైతన్నలో అంతులేని ఆనందం

పదేండ్లలో రెండుసార్లు కలిపినా అప్పటి ప్రభుత్వం దఫదఫాలుగా కేవలం రూ. 28 వేల కోట్లు రుణమాఫీ చేసింది. అప్పటితో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రుణ మాఫీ చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. అంతకు మించి  రాష్ట్రంలోని 30 లక్షల మంది రైతుల కుటుంబాల్లో ఖరీఫ్ సీజన్ ఆరంభంలోనే.. అంతులేని ఆనందం నింపింది.

వాయిదా పద్ధతిలో రైతు జీవితాలతో చెలగాటమాడిన గత కేసీఆర్​ సర్కార్​ 

పదేండ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు ఎన్నికల ముందు లక్ష రూపాయల రైతు రుణమాఫీ హామీ ఇచ్చింది.  కానీ,  అమలు చేయటంలో రైతులను వంచించింది. 2014లో అధికారంలో వచ్చినప్పుడు రైతుల రుణాలను వాయిదా పద్ధతిలో నాలుగు విడతలుగా మాఫీ చేసింది. దీంతో రైతులు కొత్త రుణాలు తీసుకోలేక.. పాత రుణానికి వడ్డీల భారం తడిసి మోపెడై చారణా కోడికి.. బారణా మసాలా.. అన్నట్లు నష్టపోయారు. 2018లో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత రుణమాఫీ పథకాన్ని అమలు చేయకుండా నాలుగేండ్లు మూలకు పెట్టింది. 

ఓకే సారి భారీ రుణమాఫీ

అటు ఉమ్మడి రాష్ట్రంలోనూ.. ఇటు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చేయని ఇంత భారీ రుణమాఫీ పథకం అమలు చేయటం ఇదే తొలిసారి. ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయటం ఆషామాషీ వ్యవహారం కానే కాదు. అందుకే ఈ రుణమాఫీ దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ అంశాన్నిచూసి.. ఇల్లు అలకగానే పండుగ కాదు.. అన్నట్లుగా దేశంలోని ఆర్థిక నిపుణులు సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఇంత భారీ రుణమాఫీ పథకం అమలు చేస్తుందా.. అని తెలంగాణ వైపు చూశారు. తెలంగాణలోని వివిధ బ్యాంకు ఖాతాల్లో పంట రుణాలు తీసుకున్న డేటా ప్రకారం.. దాదాపు 30 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులవుతారు. వీరందరి రుణాల మాఫీకి  రూ.31 వేల కోట్ల నిధులు అవసరం. 

‑ బొల్గం శ్రీనివాస్, ముఖ్యమంత్రిప్రజాసంబంధాల అధికారి